నేరుగా లోక్ సభ బరిలోకే దిగుతున్న దినేష్

posted on: Apr 7, 2014 11:04AM

 

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈరోజు వైకాపాలో చేరబోతున్నారు. ఆయనకు మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు తాజా సమాచారం. ఇంతకాలం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం వింతేమీకాకపోయినా, కోట్లు రూపాయలు పార్టీకి ఫండు, మరికొన్ని కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం ‘ఇత్యాదులకు’ మంచి నీళ్ళలా ఖర్చు చేయాల్సిన లోక్ సభ సీటుకే పోటీ చేయాలనుకోవడం చూస్తే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకొన్నారని ఇంతకాలంగా మాజీ మంత్రి శంకర్ రావు చేస్తున్నఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అనుమానించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఆయన ఎంతకాలం పనిచేసినా, ఆయన మిగిల్చుకొన్న డబ్బు లోక్ సభ సీటుకి పోటీ చేసేందుకు ఏమాత్రం సరిపోదని ఎవరికయినా తెలుసు. అయితే గతంలో శంకర్ రావు తనపై ఆరోపణలు చేస్తున్నపుడు ఆయన తనకు ఉద్యోగంలో చేరక ముందు నుండే చాలా ఆస్తులున్నాయని సంజాయిషీ చెప్పుకొన్నారు. అయితే తన ఆస్తుల వివరాలను మాత్రం ఎన్నడూ బయటపెట్టే ఆలోచన చేయలేదు. కానీ ఆయన ఇప్పుడు వైకాపా లోక్ సభ అభ్యర్ధిగా నామినేషన్ వేయదలిస్తే, తప్పనిసరిగా ఆ వివరాలను అందులో పేర్కొనవలసి ఉంటుంది. మరి ఒక పోలీసు అధికారిగా చేసి పదవీ విరమణ చేసిన ఆయన ఇంత భారీ మొత్తాలను వెచ్చించే శక్తి కలిగి ఉన్నారంటే ఆయన చాలా సౌండ్ పార్టీ అయినా అయ్యి ఉండాలి లేకుంటే శంకర్ రావు చెపుతున్నట్లుగా ఆయనకు జీతం కంటే గీతం ఎక్కువయినా అయ్యి ఉండాలని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు. ఏమయినప్పటికీ (సోనియాగాంధీకి గుడి కట్టినా కూడా టికెట్ దొరకని) ఆయన ‘ప్రియ శత్రువు’ శంకర్ రావుకే ఆయన గురించి నాలుగు ముక్కలు మాట్లాడే నైతిక హక్కు ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...