చైనా చుట్టూ డిజిటల్ ఇరన్ వాట్!

posted on: Apr 27, 2026 9:09AM

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఉన్న చైనా.. ఇప్పుడు సెల్ఫ్ ఇసోలేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.  చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నాయకత్వంలో ఆ దేశం క్రమంగా తన సరిహద్దులను మూసివేస్తూ.. ప్రపంచం నుండి తనను తాను వేరు చేసుకునే   ప్రక్రియను వేగవంతం చేస్తోంది. కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత,   సామాజిక సంబంధాల చుట్టూ కూడా  నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.  ఆ నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థ ఏంటంటే...
1. భౌతిక కదలికలు.. చైనాలో ఇప్పుడు పాస్పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం కాదు,   ఒక నియంత్రణాస్త్రం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. కొన్ని ప్రాంతాలలో సామాన్య పౌరులు సైతం పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలంటే ఏడాది కాలపు ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఫోన్ నంబర్ల నివేదికలు సమర్పించాల్సి వస్తోంది.  ముఖ్యంగా ఏఐ, సాంకేతిక రంగాలలో పనిచేసే నిపుణులపై  ఎగ్జిట్ బాన్'  విధించడం ద్వారా మేధో సంపత్తి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటోంది.
2. సామాజిక సంబంధాలు.. విదేశీయులతో లేదా విదేశీ నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటం ఇప్పుడు చైనా  ఒక భద్రతా ముప్పుగా పరిగణిస్తోంది.  ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన అంతర్గత ఆదేశాల ప్రకారం.. న్యాయ, పోలీసు విభాగాల్లో పనిచేసే వారు విదేశీ సంబంధాలు ఉన్న పాత స్నేహితులు,  కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు తెంచుకోవాలన్న ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రహస్యంగా కలిసే ప్రయత్నం చేసినా పకడ్బందీ నిఘా నీడన వారు చిక్కుకుంటున్నారు. సమాచార లీకేజీని అడ్డుకోవడమే లక్ష్యంగా, పౌరుల వ్యక్తిగత సంబంధాలను సైతం ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇది   మావో నాటి కఠిన నిబంధనలను గుర్తుకు తెస్తోంది. 

3. అంతర్గత సమాచార దిగ్బంధనం..  ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. అధికారులు తమ ఫోన్లను కార్యాలయం వెలుపల ఉండే  ఎలక్ట్రానిక్ షీల్డింగ్ లాకర్లలో ఉంచాలి. సమాచార మార్పిడికి కేవలం వైర్డ్ ల్యాండ్లైన్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2024 నాటి  ఇంటెల్  , ఏఎండీ  చిప్ లను  ప్రభుత్వ కంప్యూటర్లలో నిషేధించడం ద్వారా విదేశీ సాంకేతికతపై ఆధారపడటానికి  చైనా పూర్తిగా స్వస్తి పలికింది.
4. ఇంటర్నెట్ సరిహద్దుల మూసివేత.. 
2026 ఏప్రిల్ నుండి చైనాలో విదేశీ వెబ్సైట్లకు యాక్సెస్ ను దాదాపు అసాధ్యం చేశారు. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్) వినియోగంపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. హాంగ్ కాంగ్, మకావు వంటి ప్రాంతాల వెబ్సైట్లను సైతం బ్లాక్ చేయడం ద్వారా చైనా ఇంటర్నెట్ ను ఒక  అంతర్గత ద్వీపంగా మార్చివేసింది. 
ఇక చైనా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏమిటి అని చూస్తే..   ప్రధానంగా అంతర్గత అస్థిరత, బాహ్య ఒత్తిళ్లు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ చైనీస్ భాషలో విడుదల చేసిన రిక్రూట్మెంట్ వీడియోలకు దాదాపు 12 కోట్ల వీక్షణలు రావడం బీజింగ్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇక సమాచార చౌర్య భయం కూడా ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తోంది.  తియాంజిన్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ నుండి పది పెటాబైట్ల సున్నితమైన సమాచారం (క్షిపణి నమూనాలు, అణు సంలీన సిమ్యులేషన్లు లీక్ అవ్వడం చైనా భద్రతా లోపాలను ఎత్తిచూపింది. అదే విధంగా  దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగం పౌరులలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఈ అసంతృప్తి విదేశీ శక్తుల మద్దతుతో తిరుగుబాటుగా మారవచ్చని జీ జిన్పింగ్ ప్రభుత్వం భయపడుతోంది. చైనా అనుసరిస్తున్న ఈ సెల్ఫ్ ఐసోలేషన్ విధానం ఆ దేశాన్ని మావో కాలం నాటి క్లోజ్ డ్ సిస్టం వైపు తీసుకెళ్తోంది. ప్రజలు, మూలధనం, సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా నియంతృత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని చైనా కమ్మూనిస్టు పార్టీ (సీపీపీ) భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  అయితే, ఆధునిక యుగంలో సమాచారాన్ని, స్వేచ్ఛా కాంక్షను అడ్డుకోవడం సాధ్యం కాదనీ, చైనా అనుసరిస్తున్న ఈ విధానం.. భవిష్యత్ లో అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

References
•    China's New National Security Law & Cyber Regulations (2026).
•    Reports on Civil Servant Passport Seizures - Human Rights Watch.
•    CIA Chinese Language Recruitment Campaign Analysis.
•    Tianjin Supercomputing Center Data Breach Reports.

-సీతారాం కంఠంనేని 

google-ad-img
    Related Sigment News
    • Loading...