అమెరికా ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న కార్చిచ్చు.. నెతన్యాహుపై ట్రంప్ బూతుల పురాణం!

posted on: Jun 2, 2026 9:27AM

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత ఆప్తులుగా కనిపించే ఇద్దరు అగ్రనేతల మధ్య నమ్మశక్యం కాని రీతిలో అగ్గి రాజుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఒక రహస్య ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ మిలిటరీ సైనిక చర్యలను అంతకంతకూ తీవ్రతరం చేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఫోన్ కాల్‌ లో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత ఘాటైన, కఠినమైన  అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ విషయం అమెరికా ఉన్నతాధికారులు   బయటపెట్టారు.

మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న అత్యంత కీలకమైన దౌత్యపరమైన చర్చలకు నెతన్యాహు మొండివైఖరి తీవ్ర ఆటంకంగా మారిందని ట్రంప్ ఫైర్ అయ్యారు.  వైట్ హౌస్ అధికారుల కథనం ప్రకారం.. ట్రంప్ ఫోన్ లో మాట్లాడుతూ తన కోపాన్ని అస్సలు దాచుకోలేదు. "  నీకు పిచ్చి పట్టిందా? నేను   లేకపోతే నువ్వు ఈపాటికే జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి! నేనే నిన్ను అన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఇప్పుడు నీ వెర్రి చేష్టల వల్ల ప్రపంచదేశాలన్నీ ఇజ్రాయెల్‌ను తీవ్రంగా ద్వేషిస్తున్నాయి. అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావ్?  అంటూ ట్రంప్ గట్టిగా కేకలు వేసినట్లు అధికారులు  వెల్లడించారు. 

ఇజ్రాయెల్   దూకుడు నిర్ణయాలు ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేస్తున్నాయని, అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ట్రంప్ చాలా హెచ్చరించారు. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేయడం, బీరూట్ శివార్లలోకి సైనిక దళాలను పెద్ద ఎత్తున పంపేందుకు ప్లాన్ చేయడంతోనే ఈ వివాదం ముదిరింది. ఇజ్రాయెల్  వెనక్కి తగ్గకపోతే తాము అమెరికాతో జరుపుతున్న పరోక్ష దౌత్య చర్చల నుండి పూర్తిగా వైదొలుగుతామని ఇరాన్   గట్టిగా హెచ్చరించింది. ఇరాన్‌తో  ఖచ్చితమైన ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుని మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను తొలగించాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో నెతన్యాహు యుద్ధాన్ని మరింత విస్తరించడం ట్రంప్ కు  కోపం తెప్పించింది. 

ఈ హైడ్రామా ముగిసిన కొద్దిసేపటికే ట్రంప్ తన అధికారిక  ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా, బీరూట్ వైపు దూసుకుపోతున్న ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయని, అలాగే దాడులను తక్షణమే నిలిపివేసేందుకు హెజ్బుల్లా  అంగీకరించిందని   ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఈ ఫోన్ సంభాషణను పూర్తిగా భిన్నంగా చెప్పారు.  హెజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తామే బీరూట్‌పై అత్యంత భీకరమైన దాడులు చేస్తామని ట్రంప్‌కు అల్టిమేటం ఇచ్చినట్లు నెతన్యాహు చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ బీరూట్‌పై దాడుల ప్రణాళికను తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...