Latest News
ధారావి మురికివాడలో కరోనా వైరస్! ఒకరు మృతి
posted on: Apr 2, 2020 11:41AM
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కరోనా వైరస్ ప్రవేశించింది. కారోనా కాటుకు ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మురికివాడలో నివసించే దాదాపు పది లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికి ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు.
ఈ ధారవి మురికివాడలో సుమారుగా 10 లక్షల మంది గుడిసెవాసులు నివసిస్తున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జస్‌లోక్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.






