హైదరాబాద్‌కు చేరుకున్న ధమ్మయాత్ర–3!
posted on: Feb 19, 2026 2:44PM

ది అవేకెనింగ్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్స్ ఇన్ ఇండియా – సువర్ణభూమి టు బుద్ధభూమి పేర నిర్వహిస్తున్న ధమ్మయాత్ర–3 ఈ నెల2 కర్ణాటకలోని బుద్ధ విహార, గుల్బర్గ నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర వచ్చే నెల 2న తెలంగాణలోని బుద్ధవనం, నాగార్జునసాగర్ వద్ద ముగియనుంది. సుమారు 450 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. పాదయాత్రగా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక యాత్రకు థాయ్ భిక్షువు ఫ్రాసోంగ్‌సాక్ కోవిడో నాయకత్వం వహిస్తున్నారు. ఈ యాత్రలో సుమారు 60 మంది థాయ్ భిక్షువులు, భిక్షుణీలు,10 మంది భారతీయ భిక్షువులు పాల్గొంటున్నారు. ఈ యాత్ర గురువారం (ఫిబ్రవరి 19) హైదరాబాద్‌లోని ఆనంద బుద్ధ విహారకు చేరుకుంది. భిక్షువులు ఇక్కడ విశ్రాంతి తీసుకుని తిరిగి తమ యాత్రను శుక్రవారం (ఫిబ్రవరి 20) కొనసాగిస్తారు.
ఈ ధమ్మయాత్ర ప్రధాన లక్ష్యం బుద్ధుని ఉపదేశాలను, ఆయన ప్రజలలో రగిలించిన ప్రేమ, శాంతి, కరుణ, స్నేహభావం వంటి విలువలను విస్తరించడం. బుద్ధ ధమ్మం కులం, మతం, వర్ణం, మతభేదాలు లేని సమస్త మానవాళికీ చెందిందని నిర్వాహకులు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని గగన్ మాలిక్ ఫౌండేషన్ (భారత్), ఆశ్రయ ఫౌండేషన్ (భారత్), ఎం సీడ్స్ ఫౌండేషన్ (థాయ్‌లాండ్), త్రిరత్నభూమి సొసైటీ (థాయ్‌లాండ్) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్య నిర్వాహకులుగా గగన్ మాలిక్ (అధ్యక్షుడు, గగన్ మాలిక్ ఫౌండేషన్), మల్లెపల్లి లక్ష్మయ్య (స్పెషల్ ఆఫీసర్, బుద్ధవనం), సిద్ధార్థ్ హట్టియంబిరే (ఆశ్రయ ఫౌండేషన్), సిరిలక్ మైథాయ్ (ఎం సీడ్స్ ఫౌండేషన్), నట్టకిట్ చైచలెర్మోన్ఖోన్ (త్రిరత్నభూమి సొసైటీ) ఉన్నారు.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన అనంతరం, యాత్ర తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, కొండమల్లేపల్లి, అంగడిపేట, పెద్దవూర మీదుగా బుద్ధవనం చేరుకోనుంది. మార్చి 3న బుద్ధవనంలో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భిక్షువులు నాగార్జునకొండ మ్యూజియంను సందర్శించనున్నారు.
యాత్ర అనంతరం గుల్బర్గ బుద్ధ విహార, బుద్ధవనం తెలంగాణ, అనంతపిండక విహార (మన్నకెల్లి), మహాబోధి విహార (హైదరాబాద్) వంటి ప్రాంతాల్లో విపశ్యన శిబిరాలు నిర్వహిస్తారు. భిక్షువులు గ్రామాలు, పాఠశాలలను సందర్శించి విపశ్యన ధ్యానం మరియు బుద్ధ ధమ్మం బోధించనున్నారు.






