తిరుమల క్షేత్రం.. భక్త జనసంద్రం

posted on: May 21, 2026 9:21AM

తిరుమల భక్త జన సంద్రంగా మారింది. వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు.  విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, పరీక్షల ఫలితాలు వెలువడటంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు.   రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకుపైగా సమయం పడుతోంది.  బుధవారం( మే20)  భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.  

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు  మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం క్యూలైన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. గురువారం ( మే 21) ఉదయం  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు సాగాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  30 గంటలకు పైగా సమయం పడుతోంది. టోకెన్లు ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు,   300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.  బుధవారంశ్రీవారిని మొత్తం  86,315 మంది భక్తులు  దర్శించుకోగా.. వారిలో 44 వేల107 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  హుండీ ఆదాయం  3 కోట్ల 94లక్షల రూపాయలు వచ్చింది.   భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలోని భక్తులకు అన్నపానీయాలు అందిస్తున్నది.

google-ad-img
    Related Sigment News
    • Loading...