ఎమ్మెల్సీ రేసులో దేవినేని ఉమా, వంగవీటి రాధా.!

posted on: Aug 20, 2026 3:53PM

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తమదైన శైలిలో ప్రభావం చూపిన ఇద్దరు నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు పై ఆందోళనలో ఉన్నారు.   వై సీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో  ఖాళీ అయ్యే రెండు స్థానాలూ తెలుగుదేశం కూటమి కైవశం చేసుకోవడం ఖాయం.  ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణలు రేసులో నిలిచారు. ఆ ఇద్దరూ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 

గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలను శాసించిన దేవినేని, వంగవీటి కుటుంబాల వారసులు ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది.  

మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.  

అయితే త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో తెలుగుదేశం  అధిష్ఠానం  సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం వంటి అంశాలను   పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలలో ఉమా,  రాధాలకు ఈ సారైనా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది.  

Devineni Uma, Vangaveeti Radha, Krishna District Politics, MLC Seats, NDA Alliance

google-ad-img
    Related Sigment News
    • Loading...