ఎన్టీఆర్‌తో నెహ్రూ అనుబంధం ప్రత్యేకం..

బెజవాడ... పౌరుషానికి, ప్రతీకారానికి ప్రతీక... బెజవాడ ఊరుకాదు... ఒక చరిత్ర. ఆ చరిత్రలో దేవినేని నెహ్రూ అంతర్భాగం. ఆయన పేరు లేనిదే బెజవాడ రౌడీయిజాన్ని, రాజకీయాన్ని ప్రస్తావించలేం... ఆయన గురించి చెప్పనిదే బెజవాడ రౌడీ రాజకీయాలకు పరిపూర్ణతే రాదు. స్టూడెంట్స్ పాలిటిక్స్ మొదలు... రాజకీయంగా బెజవాడ నగరాన్ని శాసించే స్థాయివరకు ఆయన జీవితంలోని ప్రతీ మలుపూ ఆసక్తికరమే.

 

విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన నెహ్రూ రాజకీయ ప్రయాణం... తెలుగుదేశం రాకతో కొత్త మలుపు తిరిగింది. రాజకీయ నేపథ‌్య కుటుంబం నుంచి వచ్చిన నెహ్రూ.... విద్యార్ధి రాజకీయాల్లో చురుగ్గా పాల్గోనేవారు. నెహ్రూ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ స్థాపించారు. అలా స్టూడెంట్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ, 1982లో తెలుగుదేశంలో చేరి, స్టేట్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

 

కంకిపాడు నుంచి నాలుగుసార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ....ఎన్టీఆర్‌కు వీర విధేయుడుగా, అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. ఎన్టీఆర్‌ హయాంలోనే టీడీపీ తరపున నాలుగుసార్లు కంకిపాడు నుంచి వరుసగా విజయం సాధించిన నెహ్రూ.... సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996 సంక్షోభ సమయంలో నెహ్రూ... ఎన్టీఆర్‌ పక్షానే నిలిచారు. ఎన్టీఆర్‌‌తో అంత సన్నిహితంగా ఉండేవారు నెహ్రూ. అందుకే తనకు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని తండ్రీకొడుకుల బంధంతో పోల్చిచెప్పేవారు. 

 

చివరివరకు ఎన్టీఆర్‌‌తో ఉన్న నెహ్రూ ఆయన మరణాంతరం కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్‌ నుంచి నాలుగుసార్లు పోటీ చేస్తే, ఒక్కసారి మాత్రమే 2004లో విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌‌లో ఉన్నప్పటికీ ఎన్టీఆరే తమ దైవమని చెప్పుకునేవారు. అయితే ఏ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో, తన చివరి రోజుల్లో మళ్లీ అదే పార్టీలో చేరి, తెలుగుదేశం జెండా కప్పుకుని వెళ్లిపోతానన్న నెహ్రూ తన మాట నెగ్గించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu