రంగారెడ్డి జిల్లా స్థాయిలో అనకాపల్లి అభివృద్ధి : సీఎం చంద్రబాబు

posted on: Apr 23, 2026 2:57PM

 

విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని, ఇంకా రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో గురువారం (23-4-26న) పర్యటించిన సీఎం.. రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను అదృష్టం వరించిందని.. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్‌ స్టీల్‌ కంపెనీ వచ్చిందన్నారు. 

ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని.. ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తామని తెలిపారు. ఏడాదిలోగా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.‘ఏపీ పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పాం.. చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు సగర్వంగా పేర్కొన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. 

కరెంట్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పామన్నారు. తక్కువ ఖర్చుతో కరెంట్‌ ఉత్పత్తి జరగాలని.. సోలార్‌ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతులే కరెంట్‌ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని చెప్పుకొచ్చారు. రెండుమూడేళ్లలో 40 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్‌ కరెంట్ అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...