మాజీ ప్రధానిని ఎండలో నిలబెట్టిన గవర్నర్

posted on: Apr 5, 2016 10:22AM

 

హెచ్.డి దేవేగౌడ భారత మాజీ ప్రధాని, సమకాలీన రాజకీయాల్లో ఈయన కూడా ఒక కురువ‌‌ృద్ధుడు. గతంలో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మండుటెండలో నిలబెట్టారు కర్ణాటక గవర్నర్. అవినీతిపరుల అంతం చూసి దేశ వ్యాప్తంగా కర్ణాటకకు పేరు తీసుకువచ్చిన లోకాయుక్త సంస్థను నిర్వీర్యం చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నియంత్రణ దళాన్ని వ్యతిరేకిస్తూ జెడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ ఆందోళనకు దిగారు. బెంగళూరులోని ఆనందరావు జంక్షన్ నుంచి స్వతంత్ర పార్క్ వరకు పాదయాత్ర నిర్వహించిన ఆయన గవర్నర్ వాజూభాయివాలాకు వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనికి ముందస్తు అనుమతి లేదంటూ రాజ్‌భవన్ భద్రతా సిబ్బంది దేవేగౌడను గేటు వద్దే నిలిపివేశారు.

 

గవర్నర్ అనుమతి కోసం ఆయన సుమారు 45 నిమిషాల పాటు ఎండలోనే ఎదురు చూశారు. దీంతో ఆగ్రహించిన దేవేగౌడ ఇది కర్ణాటక. గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి కన్నడిగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం అంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తూ తన ఎమ్మెల్యేలతో పాటు గేటు బయట రోడ్డు మీద బైఠాయించారు. అప్పటికి గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. దీంతో నిరాశతో గౌడ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏది ఎమైనా ఒక మాజీ ప్రధానిని వయసును చూసైనా గవర్నర్ తగిన గౌరవం ఇచ్చుంటే బాగుండేది. లేదంటే దీని వెనుక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి ఏదైనా ఉందా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...