40 ఏళ్ల అజ్ఞాత జీవితం....లొంగిపోయిన మావో అగ్రనేతలు
posted on: Feb 24, 2026 4:47PM

హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో కార్యకలాపాలు నిర్వహించిన ఈ అగ్రనేతలు లొంగుబాటు చేయడం మావోయిస్టు పార్టీకే పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని పోలీసులు ప్రకటించారు.
లొంగుబాటు చేసిన వారిలో పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం/సంతోష్ గామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు.
ఈ సందర్బంగా దేవ్‌జీ మాట్లాడుతు త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అనారోగ్య సమస్యలతో తాను అజ్ఞాత జీవితం వీడానన్నారు. మవోయిజం అంతం కాదని, ప్రజా సమస్యలపై పోరాడుతామని మరో నేత రాజిరెడ్డి తెలిపారు.ప్రస్తుతం అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నానని వివరించారు. త్వరలోనే ఇంటర్వ్యూల రూపంలో అన్ని ప్రశ్నలకు వివరంగా సమాధానమిస్తానని హామీ ఇచ్చారు.
40 ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత కీలక నిర్ణయం
ఈ నేతలు నలభై ఏళ్లకుపైగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేశారు. ఆయుధ దళ కార్యకలాపాలు, ప్రాంతీయ కమిటీల నిర్వహణ, కేంద్ర స్థాయి వ్యూహరచన వంటి కీలక బాధ్యతలు చేపట్టిన వీరి లొంగుబాటు మావోయిస్టు నిర్మాణానికి తీవ్రమైన దెబ్బగా అధికారులు పేర్కొన్నారు.
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి
1982లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన దేవుజి దండకారణ్యంలో ఆయుధ దళ కార్యకలాపా ల్లో కీలక పాత్ర పోషించారు.1984–89 మధ్య సిరోంచా, పెరిమిలి ప్రాంతాల్లో దళ కమాండర్‌గా పనిచేశారు. 1989లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2001లో సెంట్రల్ కమిటీ సభ్యత్వంతో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో చోటు దక్కించుకున్నారు. తరువాత సిఎంసి ఇన్‌చార్జ్‌గా, అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగి పార్టీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు.
మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం (76)
1970లలో ఉద్యమంలోకి వచ్చిన మల్లారాజి రెడ్డి 1980లలో డివిజనల్, రాష్ట్ర కమిటీల్లో పనిచేశారు.1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు.మహారాష్ట్ర–దండకారణ్య ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2001 నుంచి 2017 వరకు సౌత్ రీజనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, పొలిట్ బ్యూరోలో పనిచేశారు.2022లో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిం చారు.
బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (47)
1996లో ఆర్ఎస్ యూతో ఉద్యమంలోకి ప్రవేశించారు. ఏటూరునాగారం–మహాదేవపూర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యుడిగా పని చేశారు. తరువాత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ లొంగు బాటుతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ పునరావాస విధానాలపై నమ్మకం ఉంచి ఈ నేతలు జనజీవనంలోకి వచ్చారని డిజిపి పేర్కొన్నారు.



.webp)



