డేరా కూతురు అనుకున్నారు..తీరా చూస్తే
posted on: Sep 21, 2017 11:58AM

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ న్యాయస్థానం 20 ఏళ్ల శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ను తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు..పంచకులలో విధ్వంసం, గుర్మీత్‌ను జైలుకు తరలిస్తుండగా జరిగిన దాడి ఇవన్నీ ఆ కుట్రలో భాగమే..వీటన్నింటి వెనుక మాస్టర్ మైండ్ డేరా పెంపుడు కూతురు హనీప్రీత్ సింగ్‌గా తేల్చారు పోలీసులు.
ఆ రోజు నుంచి ఆమెను పట్టుకోవడానికి హర్యానా పోలీసులు సహా బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సైన్యం దేశ సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అచ్చం ఆమె లాగే ఉన్న మహిళ పోలీసులను పరుగులు పెట్టించింది. నేపాల్‌లోని ధరానా వార్డు 13 సమీపంలో ఓ భారత నెంబర్ ప్లేట్ గల లగ్జరీకార్ సైన్యం కంటబడింది. దానిలో అందంగా, అచ్చుగుద్దినట్లు హనీప్రీత్ సింగ్‌లా ఓ యువతి కనిపించడంతో సైన్యం, పోలీసులు కారును చేజ్ చేసి ఆమెను పట్టుకున్నారు. అనంతరం ఆ కొద్దిసేపటికే డేరాబాబా కుమార్తె హనీప్రీత్ అరెస్ట్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కాసేపు ప్రశ్నించిన తర్వాత సదరు యువతి హనీప్రీత్ కాదని వదిలివేశారు. ఆమె బీహార్ రాజధాని పాట్నాకు చెందినదిగా తెలుస్తోంది.







