పవన్ చెప్పిన...ఎర్రచందనం కొత్త సెంటిమెంట్ కథ!
posted on Nov 9, 2025 9:59AM

శేషాచలంలో మాత్రమే పెరిగే ఎర్రచందనం చెట్ల వెనక ఉన్న ఒకానొక ఆధ్యాత్మిక గాథను వెలుగులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి కూడా అయిన పవన్ కళ్యాన్. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన వెంకటేశ్వరస్వామివారికి గాయం అయ్యిందని. ఆ గాయం కారణంగా రక్తం చిందిందని. ఆ రక్తమే ఇక్కడి గంధపు చెట్లకు అంటి అవి ఎర్రచందనం చెట్లుగా మారాయని అన్నారాయన. ఇంతటి డివైన్ స్టోరీస్ ఈ రెడ్ శాండల్ ట్రీస్ వెనక దాగి ఉన్నాయి కాబట్టి.. ఎవ్వరూ వీటి స్మగ్లింగ్ కి పాల్పడ వద్దని సూచించారు.
కొన్నాళ్ల పాటు చూసి ఇలాంటి రెడ్ స్మగ్లర్ల పట్ల తాము కఠినంగా వ్యవహరించబోతున్నామని కూడా వార్న్ చేశారు పవన్ కళ్యాణ్. అదెలా ఉండబోతుందంటే ఇప్పటికే తాము నాలుగు కింగ్ పిన్స్ ని ఐడెంటిఫై చేశామనీ.. ఇలాంటి వారి కింద పని చేసే చోటా మోటా సాధారణ కూలీలతో సహా తమ వద్ద వివరాలున్నాయని.. ఎవరైనా సరే వచ్చే రోజుల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ని గానీ కంటిన్యూ చేస్తే.. వారిని ఆపరేషన్ కగార్ లా.. మరో కొత్త ఆపరేషన్ని నిర్వహించి.. ఈ రెడ్ స్మగ్లర్లను సమూలంగా నాశనం చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే రెడ్ శాండల్ దేశాంతరాలు దాటుతోందని.. ఇక్కడి శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం ఎక్కోడో నేపాల్లో పట్టుబడుతోందని అన్నారు డీసీఎం పవన్. ఇటీవల మొత్తం ఐదు రాష్ట్రాలతో తాము ఒప్పందం చేసుకున్నామనీ.. ఈ ఒప్పందంలో భాగంగా ఎక్కడ ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డా వాటిని ఏపీకి అప్పగించాలన్న టై- అప్ చేస్తున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఒక రాష్ట్రం వారు తమకు పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను అమ్మితే ఏకంగా వంద కోట్లకు పైగా సొమ్ము వారి రాష్ట్ర ఖజానాకు అందివచ్చిందని అన్నారు పవన్.
తాము అడవుల్లోకి వెళ్లి చూడగా.. ఎర్రచందనం చెట్టు ఒక్కటీ సజావుగా కనిపించలేదనీ.. అన్ని చెట్లను నరికివేసినట్టు గుర్తించామనీ చెప్పుకొచ్చారు పవన్.. ఇలా చేస్తే ఈ ప్రాంత జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గా ఉన్న ఈ ఎర్రచందనం చెట్టు కొన్నాళ్లకు పూర్తిగా కనుమరుగై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.
ఇప్పటికే లక్షలాది చెట్లను నరికి, కోట్లాది రూపాయలను వెనకేశారనీ.. ఇలాంటి నేరం ఘోరం ఇకపై జరగగడానికి వీల్లేదంటూ.. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి రక్తంతో తడిసిన ఈ చెట్ల పట్ల అందరూ జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ దుంగలను పరిశీలించారు పవన్. వీటి విలువ ఐదు వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.
ఇదిలా ఉంటే.. గతంలో టాస్క్ ఫోర్స్ వారు తమకు పట్టుబడ్డ తమిళనాడు స్మగ్లర్ల చేత వెంకటేశ్వరస్వామి వారిపై ఒట్టు వేయించేవారు. ఈ సెంటిమెంటు ద్వారానైనా తమిళనాడు జావాదిమలై వంటి ప్రాంతాల నుంచి వచ్చే స్మగ్లర్లను అరికట్టాలని చూశారు. ఆపై ఎన్ కౌంటర్లు చేయడం, అటు పిమ్మట చెట్ల కోసం మనుషులను చంపుతారా!? అంటూ తమిళనాట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. పవన్ హెచ్చరికలను బట్టీ చూస్తుంటే.. మళ్లీ అలాంటి ఉపద్రవం ఏదో జరగబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ హెచ్చరికల నేపథ్యంలో స్మగ్లర్లు వెనక్కు తగ్గుతారా? లేక.. ఎప్పటిలాగా లైట్ తీస్కుని తమ నరుకుడు తాము చేస్కుంటూ పోతారా; తేలాల్సి ఉంది.