ప్ర‌భుత్వ బంగ్లాలు.. మాజీలూ తాజాల మ‌ధ్య‌ ప్ర‌జాస్వామిక స‌వాలు!

posted on: Jun 8, 2026 6:06AM

బిహార్‌లో రాబ్రీ దేవి వ‌ర్సెస్ సమ్రాట్ చౌధరి మధ్య బంగ్లా వివాదం మళ్లీ ఒక పాత ప్రశ్నను తెర‌పైకి తెచ్చింది. ప్రభుత్వ బంగ్లాలు ఎవరిది? పదవి దక్కినవారిదా? లేక పన్ను చెల్లించే ప్రజలదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం.. బిహార్, లూటియన్స్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉదాహరణలను కలిపి చూసినప్పుడు, ఒక విష‌యం స్పష్టమవుతుంది. పదవి ముగిసినా, అధికారపు అలవాటు మాత్రం అంత తేలిక‌గా ముగియదని. .

ప్రభుత్వ బంగ్లాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా.. ఒకే సూత్రంపై నిలబడి ఉన్నాయి.  పదవిలో ఉన్నంత కాలం, అధికార నిర్వహణకు అవసరమైన సౌకర్యం. పదవి ముగిసిన తర్వాత, ఆ సౌకర్యం కూడా ముగియాలి. ఇదే ప్రజాస్వామ్య సూత్రం. అయితే, స్వాతంత్రం త‌ర్వాతి కాలంలో.. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఒక అలవాటు రాజకీయం పెరిగింది. మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్  బ్యూరోక్రాట్లు.. వీరిలో చాలామంది అధికార నివాసాలను  లైఫ్‌టైమ్ ప్రివిలేజ్ లా భావిస్తూ, పదవి ముగిసినా బంగ్లాలు ఖాళీ చేయకుండా కొనసాగారు. ఈ అలవాటు క్రమంగా  రాజకీయ హక్కులా మారింది.

10, జనపథ్, న్యూ ఢిల్లీ.. గత మూడు దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో ఒక పాపుల‌ర్ చిరునామా. ఈ బంగ్లా మొదట 1990 జనవరిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి కేటాయించారు. ఆయన హత్య త‌ర్వాత‌, 1991 మేలో సోనియా గాంధీకి మళ్లీ కేటాయించారు. ఇది చట్టపరంగా అనుమతించిన కేటాయింపే అయినప్పటికీ, ఒకే కుటుంబం దశాబ్దాల పాటు కేంద్ర ప్రాంతంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ బంగ్లాను ఆక్రమించుకోవడం అనే విమర్శ ఎప్పటికప్పుడు వినిపిస్తూ వచ్చింది.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాలపై  అనధికార ఆక్రమణల శుద్ధి  పేరుతో పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. మోడీ పాల‌న‌క‌న్నా  ముందు అంటే, 2013లో – 246 ఇళ్లు ఖాళీ చేయించారు. 2014లో – 539 ఇళ్లు, 2015లో – 746 ఇళ్లు.. ఆ సమయానికిది రికార్డు సంఖ్య కాగా.. మొత్తం 2013–2015 మధ్య కాలంలో.. 1,531 ప్రభుత్వ గృహాలు- ప‌బ్లిక్ ప్రెమిసిస్ యాక్ట్ కింద ఖాళీ చేయించారు.
 
ఈ డ్రైవ్‌లో.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఉన్నతాధికారులు.. అనేకానేక మంది లక్ష్యంగా నిలిచారు. కొందరు కోర్టులను ఆశ్రయించారు, స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు, కానీ, కేంద్ర ప్రభుత్వ సంకేతం స్పష్టంగా కనిపించింది.. లూటియన్స్ ఢిల్లీ.. ఇకపై శాశ్వత VIP కాలనీ కాద‌ని తేల్చి చెప్పింది.

బిహార్‌లో 10, సర్క్యులర్ రోడ్, పాట్నా. ఇది చాలా కాలంగా లాలూ–రాబ్రీ కుటుంబంతో పాటు ఆర్‌జేడీ రాజకీయ కేంద్రంగా ఉంది. నితీశ్ కుమార్ ప్రభుత్వ కాలంలో, మాజీ ముఖ్యమంత్రిగా రాబ్రీ దేవికి ఈ బంగ్లా కేటాయించారు. తర్వాత.. రాబ్రీ దేవి ఇప్పుడు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ,
ప్రభుత్వం 10, సర్క్యులర్ రోడ్‌ను డిప్యూటీ సీఎంకి  కేటాయిస్తూ, రాబ్రీ దేవికి 39, హార్డింగ్ రోడ్‌లో కొత్త బంగ్లా కేటాయించింది. 

అయితే, రాబ్రీ దేవి బహిరంగంగా ప్రకటించింది.. సమ్రాట్ చౌధరి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. బలవంతంగా ఖాళీ చేయించాలనుకుంటే చేయించుకోండి. నేను బంగ్లా ఖాళీ చేయను.. అని తెగేసి చెప్పారామె. ఇది కేవలం ఒక వ్యక్తిగత నివాస వివాదం కాదు. ప్రభుత్వ బంగ్లా ఎవరి సొత్తు? అనే ప్రశ్నను బిహార్ రాజకీయాల్లో చెల‌రేగింది.

ఉత్తరప్రదేశ్ – సుప్రీంకోర్టు తీర్పు, మాజీ ముఖ్యమంత్రుల బంగ్లాల విష‌యానికి  వ‌స్తే.. 2018 మేలో సుప్రీం.. ఒక కీలక తీర్పు ఇచ్చింది.. ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు జీవితాంతం ప్రభుత్వ బంగ్లాలు ఆక్రమించుకునేలా చేసిన రాష్ట్ర చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది.  పదవీ కాలం ముగిసిన తర్వాత, ప్రత్యేక గృహ సౌకర్యం కొనసాగించడం.. సమానత్వ సూత్రానికి విరుద్ధం..  అని స్పష్టం చేసింది  కోర్టు. ఈ తీర్పు తర్వాత.. అఖిలేశ్ యాదవ్ 4, విక్రమాదిత్య మార్గ్, లక్నోలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఇతర మాజీ ముఖ్యమంత్రులు కూడా బంగ్లాలు విడిచిపెట్టాల్సి వచ్చింది.

అఖిలేశ్ యాదవ్ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. బంగ్లాలోని ఖరీదైన ఫిట్టింగ్స్, ట్యాపులు, ఎలక్ట్రికల్ ఫిక్చర్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులు తొలగించార‌ని ఆరోపించింది.
మీడియా ఈ వివాదాన్ని ట్యాప్ థెఫ్ట్,  బంగ్లా రో.. పేరిట పెద్ద ఎత్తున క‌థ‌నాలు వండి వార్చింది. అఖిలేశ్ యాదవ్.. తాను ఏ ప్రభుత్వ ఆస్తి తీసుకోలేదు, ఇది రాజకీయ ప్రతీకారం.. అంటూ స‌మాధాన‌మిచ్చారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సాధారణ ట్యాపులు చూపిస్తూ, ఇవి దొంగిలించాల్సినంత విలువైనవి కావని కూడా ఆయ‌న  కామెంట్ చేశారు.  కేసు క్రిమినల్ శిక్షార్హ స్థాయికి వెళ్లలేదు. కానీ, ప‌బ్లిక్ డిబేట్, సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో ఇది నెలల తరబడి ప్రధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చ‌ట్ట ప్ర‌కారం.. ప్రభుత్వ గృహం, కార్యాలయం, భూమి – ఇవన్నీ పబ్లిక్ ప్రెమైసెస్ గా పరిగణిస్తారు.
కేటాయింపు గడువు ముగిసిన తర్వాత, లేదా పదవి ముగిసిన తర్వాత, ఆ ప్రాంగణంలో కొనసాగితే – అది అనధికార ఆక్రమణగా పరిగణించబడుతుంది. ఎస్టేట్ ఆఫీసర్ నోటీసు ఇచ్చి, అవసరమైతే బలవంతంగా ఖాళీ చేయించగ‌ల‌ అధికారంతో ఉంటాడు. కేంద్ర ప్రభుత్వపు 2013–2015 కాల‌పు డ్రైవ్.. ఈ చట్టం ఆధారంగానే నడిచింది. 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యంలో పదవి ఒక తాత్కాలిక బాధ్యత, ఆ బాధ్యత ముగిసిన తర్వాత, ప్రత్యేక గృహ సౌకర్యం కొనసాగించడం సమానత్వ హక్కు అయిన ఆర్టిక‌ల్- 14 కు విరుద్ధం. రాష్ట్రం ప్రజా నిధులను కొద్దిమంది మాజీ నేతల సౌకర్యం కోసం శాశ్వతంగా కేటాయించ లేదు. బిహార్‌లో రాబ్రీ దేవి బంగ్లా వివాదంపై మాట్లాడిన సమ్రాట్ చౌధరి, ఇతర నేతలు కూడా ఇదే తీర్పును ప్రస్తావిస్తూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు బంగ్లాలు శాశ్వ‌తంగా ఉంచుకోలేరని చెప్పాయ‌ని గుర్తు చేశారు.
 
రాబ్రీ దేవి.. బలవంతంగా ఖాళీ చేయించాలనుకుంటే చేయించుకోండి, నేను బంగ్లా ఖాళీ చేయన‌ని అన్నారామె. ఇది కేవలం భావోద్వేగ స్పందన కాదు.. ఆర్‌జేడీ రాజకీయ సందేశం కూడా..  ఇది మా కుటుంబం, మా పార్టీకి ప్రతీకాత్మక చిరునామా అన్న‌ది ఆమె కామెంట్ల సారాంశం.  ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోంది అనే  సందేశాన్ని  ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నారామె. 

ఇక సమ్రాట్ చౌధరి, జేడీయూ–బీజేపీ వర్గం వాద‌న ఎలాంటిదంటే..  సర్కారీ మకాన్ కిసీ కీ బపౌతి నహీ హై.. అంటే,  ప్రభుత్వ గృహాలు ప్రజల ఆస్తి. వీటిపై ఎవరికీ శాశ్వత హక్కు లేదు అని తేల్చి చెబుతోంది. ఇది బిహార్‌లో లాలూ కుటుంబం వ‌ర్సెస్ కొత్త‌ NDA ప్ర‌భుత్వం..  అనే అతి పెద్ద రాజకీయ కథనాల్లో ఒక భాగంగా మారింది.  బిహార్‌లో 10, సర్క్యులర్ రోడ్ బంగ్లా.. కేవలం ఒక ఇల్లు కాదు. అది ఆర్‌జేడీ రాజ‌కీయ పోరాట కేంద్రం.

మీడియా, ముఖ్యంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా – బంగ్లాలోని ఫోటోలు, వీడియోలు, పగిలిన గోడలు, తీసివేసిన ట్యాపులు, ఫిట్టింగ్స్‌ను సెన్సేషనల్ విజువల్స్గా చూపించాయి.  మాజీ సీఎం- బంగ్లా దోపిడీ చేశాడా?  అనే శీర్షికలతో డిబేట్లు జరిగాయి. అఖిలేశ్, అదే స్థాయిలో మీడియా–పబ్లిక్ థియేటర్‌లోకి దిగుతూ, ట్యాపులు చూపిస్తూ ప్రతివాదం చేశాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే,  ప్రభుత్వ ఆస్తి పట్ల బాధ్యతా? లేక రాజకీయ ఇమేజ్ మేనేజ్‌మెంట్‌? 

లూటియన్స్ ఢిల్లీలోని బంగ్లాలపై ప్రజాభిప్రాయం.. చాలా కాలంగా ఒకేలా ఉంది.  కొద్దిమంది నేతలు, అధికారుల కోసం కోట్ల రూపాయల విలువైన భూమి, బంగ్లాలు, సిబ్బంది, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఖర్చులు – ఇవన్నీ పన్ను చెల్లించే ప్రజల డబ్బుతోనే. మోడీ ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ ఖాళీ చేయింపులు, ఒకవైపు ప్రజా కోపానికి రాజకీయ సమాధానం, మరోవైపు..  పాత ఎలైట్‌పై కొత్త ఎలైట్ దాడి గా కూడా విశ్లేషించారు. క్లీనింగ్ ఆఫ్ లూటియన్స్ ఢిల్లీ..  ఒకవైపు ప్రజాస్వామ్య శుభ్రత, మరోవైపు అధికార పోరాటంగా మారింది.

ఈ మొత్తం కథలో ఒక స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. చట్టం, నైతికత ఇందులో రెండు పార్శ్వాలు.  
పదవి ముగిసిన తర్వాత, ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలి. ప్రజా నిధులు, ప్రజా ఆస్తులు – కొద్దిమంది VIPల వ్యక్తిగత సౌకర్యం కోసం కాదు.

నేను మాజీ సీఎం/మాజీ మంత్రి/మాజీ అధ్యక్షుడు – నాకు ప్రత్యేక హక్కు ఉంది అనే భావన. బంగ్లాను పార్టీ కార్యాలయం, కుటుంబ కేంద్రం, రాజకీయ శక్తి ప్రతీకగా ఉపయోగించడం. రాబ్రీ దేవి, సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఇతర మాజీ నేతల ఉదాహరణలు – ఇవన్నీ ఒకే పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తాయి.  ప్రజాస్వామ్యంలో పదవి ముగిసిన తర్వాత కూడా, అధికారపు నివాసం కొనసాగాలా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

సూటిగా చెప్పాలంటే.. ప్రభుత్వ బంగ్లాలు ప్రజల ఆస్తి- ఎవరి సొంత‌ జాగీరు కాదు. మాజీ నేతలు, ఎంత గొప్ప సేవ చేసినా, పదవి ముగిసిన తర్వాత ప్రత్యేక గృహ హక్కు కోరడం నైతికంగా సమర్థించలేము.
అదే సమయంలో, ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని ఎంచుకున్న రాజకీయ ప్రతీకారం కోసం ఉపయోగించకూడదు. 

ఒకే చట్టం, ఒకే ప్రమాణం – మిత్రులకు, శత్రువులకు సమానంగా వర్తించాలి. ఈ వివాదాలన్నింటి తర్వాత, కొన్ని స్పష్టమైన సంస్కరణలు అవసరం.  పదవి ముగిసిన తర్వాత ఎంత కాలం వరకు అధికార నివాసం ఉపయోగించవచ్చు? ఆ గడువు ముగిసిన తర్వాత, ఖాళీ చేయకపోతే ఏ శిక్షలు? అని  చూస్తే.. కేంద్ర–రాష్ట్ర స్థాయిలో, ఎవరు ఎంతకాలంగా ప్రభుత్వ గృహాల్లో ఉన్నారు? ఎవరు గడువు దాటారు? ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి.  

అధికారంలో ఉన్నవారికి ఒక ప్రమాణం, ప్రతిపక్షానికి మరో ప్రమాణం – ఈ ద్వంద్వ వైఖరి తగ్గాలి.
ప్ర‌జాస్వామ్యంలో అధికార నివాసం ఒక సౌకర్యం మాత్రమే. అది వారసత్వ హక్కు కాదంటారు నిపుణులు. 
 
రాబ్రీ దేవి  బలవంతంగా ఖాళీ చేయించండి, నేను వెళ్లను  అని సవాల్ విసరడం, అఖిలేశ్ యాదవ్ ట్యాప్ థెఫ్ట్ ఆరోపణలతో నెలల తరబడి వార్తల్లో నిలవడం, లూటియన్స్ ఢిల్లీలో వేలాది ఇళ్లు ఖాళీ చేయించడం.. ఇవి అన్నీ కలిపి చూస్తే, ఒకే స్పష్టమైన సందేశం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే పదవి, బంగ్లా, సెక్యూరిటీ కాదు. ప్రజాస్వామ్యం అంటే బాధ్యత, పారదర్శకత, ప్రజా ఆస్తిపై గౌరవం.
మాజీ నేతలు, ప్రస్తుత ప్రభుత్వాలు, మీడియా – అందరూ ఈ సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని అంటారు విశ్లేష‌కులు. ప్రజల డబ్బుతో నిర్మించిన గృహాలు, చివరికి ప్రజలకే సేవ చేయాలి – వ్యక్తిగత ప్రతిష్ఠకు కాద‌న్న‌ది  ఫైన‌ల్ కామెంట్.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...