ICU లో అత్యాచారాలు

posted on: Feb 15, 2016 8:56AM

పసిపిల్లల మీదా, మానసిక వికలాంగుల మీదా అత్యాచారాలు జరిగిన వార్తలను విన్నాం. కానీ ఇప్పుడో మృగం హాస్పిటల్‌లోని ICU వార్డులలో ఉండే స్త్రీలని లక్ష్యంగా చేసుకుని సాగించిన దారుణాలు వెలికివస్తున్నాయి. దిల్లీకి కేవలం 30 కిలోమీటర్లు ఉండే బహదూర్‌ఘర్‌ అనే ఊరిలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆ ఊళ్లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ ముందు ఒక ఖరీదైన కారు అగింది. ఆ కారులోంచి ఖరీదైన బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి నేరుగా హాస్పిటల్లోని ICU వార్డులోకి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. డాక్టరేమో అని కొందరు, పేషెంటు తాలూకానేమో అని మరి కొందరు చూసి కూడా చూడనట్లు ఉండిపోయారు. నేరుగా ICUకి చేరుకున్న అతను అక్కడ నిస్సహాయంగా పడి ఉన్న ఒక పచ్చి బాలింతరాలి మీద తన అకృత్యాన్ని సాగించాడు. పని ముగిసిన తరువాత అంతే ఠీవిగా తిరిగి వెళ్లిపోయాడు. అక్కడితో అతని పైశాచికం ఆగలేదు. దగ్గరలో ఉన్న మరో హాస్పిటల్ లోపలికి వెళ్లి అక్కడా ఇలాంటి దారుణానికే ఒడిగట్టేందుకు చూశాడు. కానీ బాధితురాలు గట్టిగా అరవడంతో పారిపోయాడు. నిందితుడి మొహం ఆ రెండు ఆసుపత్రులలో ఉన్న సీసీ టీవీలలో రికార్డు కావడంతో అతణ్ని పట్టుకోవడం ఎలాగూ ఖాయం. కానీ ఆసుపత్రుల సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం మరో రూపంలో పొంచి ఉండదా అన్నదే రోగుల సందేహం. చీకటి పడేసరికి, పేషెంట్ల తాలూకు బంధువులు కూడా ఎవ్వరూ హాస్పిటల్లో ఉండకూడదంటూ తరిమేసే హాస్పిటల్‌ సిబ్బంది... అర్ధరాత్రి దాటాక వచ్చిన ఆ ఆగంతుకుని సాదరంగా లోపలికి పంపడం వెనుక ఉన్న నిర్లక్ష్యం సామాన్యమైనది కాదు! నిందితుడి వాలకం చూస్తే ఇదేమీ అతనికి కొత్త కాదేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.  మత్తులోనో, నిస్సహాయంగానో ఉన్న ఆడవారు గట్టిగా అరవలేరు అన్న ధీమాతో అతను సాగించిన పైశాచికానికి మృగాలు సైతం తలలు వంచుకుంటున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...