ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్
posted on: Mar 17, 2026 10:46AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఇంతకు ముందే కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.





