అది ఉగ్ర చర్యే.. ఢిల్లీ పేలుడుపై కేంద్రం అధికారిక ప్రకటన
posted on Nov 13, 2025 2:16PM
.webp)
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం ఉగ్రచర్యగా ప్రకటించింది. ఈ నెల 10న జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా 20 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఈ పేలుడు ఘటన ఉగ్ర చర్యేనని కేంద్రం ధృవీకరించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (నవంబర్ 12) కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రం ఢిల్లీ పేలుడును ఉగ్ర చర్యగా ప్రకటించింది. ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలోని టెలిగ్రామ్ చాట్ల ద్వారా ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం బయటపడిందని దర్యాప్తు సంస్థలు చెప్పాయి.