డిఫెన్స్ లిక్కర్ దందా గుట్టురట్టు…రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అక్రమ వ్యాపారం

posted on: Apr 21, 2026 11:28AM

 

హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఎక్సైజ్ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. డిఫెన్స్ క్యాంటీన్లకు మాత్రమే పరిమితమైన విలువైన ప్రీమియం మద్యం… నగరంలోని బడా కస్టమర్లకు గుట్టు చప్పుడు కాకుండా సరఫరా అవుతున్నట్లు బయటపడింది. బెంగళూరు, హర్యానా డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి ఖరీదైన లిక్కర్‌ను తెప్పించి అక్రమంగా హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి (48) ను గుర్తించారు.

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మాజీ సైనికుడు… లాభాల కోసం అక్రమ మద్యం వ్యాపారానికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిఫెన్స్ ప్రీమియం లిక్కర్‌ను హైదరాబా ద్‌లోని బడా బాబులకు అమ్ముతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్ బృందం మంగళవారం ఉదయం హస్తినాపురం లోని శ్రీ రమణ కాలనీ ఫేస్–2లోని ఆయన ఇంటిపై మెరుపు దాడి చేశారు.

ఈ దాడుల్లో ఇంట్లో దాచిపెట్టిన 361 ప్రీమియం మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఎక్సైజ్ బృందం ఇంటికి చేరుకున్నట్లు తెలిసిన వెంటనే నిందితుడు సురేష్ రెడ్డి పరారయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డిఫెన్స్ లిక్కర్ అక్రమ విక్రయాలపై మరిన్ని దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...