శ్రీశైలంలో కన్నులపండువగా జ్వాలా తోరణం
posted on Nov 6, 2025 7:57AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు జ్వాలాతోరణాలను దివిటీలతో వెలిగించగా, భక్తులు ఓం నమః శివాయ, హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ చేసిన శివ నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది.
భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునీతులైయ్యారు. ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ తమ భక్తిని చాటుకున్నారు. జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.