దావూద్ ఫొటోని అయినా పట్టుకోండి
posted on May 6, 2015 10:44PM

ముంబైలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినప్పుడు దావూద్ ఇబ్రహీంని ఎవరూ పట్టుకోలేదు. డి-కంపెనీని ధూమ్‌ధామ్‌గా నిర్వహించినప్పుడు అతని జోలికి ఎవరూ వెళ్ళలేదు. ముంబైలో బాంబు పేలుళ్ళు జరగడానికి కారకుడైనప్పుడు ఎవరూ పట్టుకోలేదు. బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత ఎంచక్కా పాకిస్థాన్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరూ పట్టుకోలేదు. పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీం ఎంచక్కా హాయిగా జీవిస్తున్నాడు. ఆయన సోదరులు, బంధువులు ముంబైలోనే విలాస జీవితాన్ని గడుపుతున్నారు. దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి పాకిస్థాన్ క్రికెటర్ మియాందాద్ కొడుకుతో మొన్నామధ్య వైభవంగా జరిగింది. అప్పుడూ అతగాడిని ఎవరూ పట్టుకోలేదు. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీంని ఇంతవరకు ఇండియా పోలీసులు, సీబీఐ, ఇతర సంస్థలు పట్టుకోలేకపోవడం మనం సిగ్గుపడాల్సిన అంశం.
ఇప్పటి వరకు పట్టుబడని దావూద్ ఇబ్రహీంని భవిష్యత్తులో పట్టుకుంటామన్న నమ్మకం కూడా లేదు. దావూద్‌ని పట్టుకోవడం సంగతి అటు వుంచి, అతని లేటెస్ట్ ఫొటోని కూడా మనవాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇక మనిషిని ఏం పట్టుకుంటారు. గూగుల్లో దావూద్ ఇబ్రహీం అని ఇమేజెస్ కోసం సెర్చ్ చేస్తే, ఎప్పుడో పాతికేళ్ళ వయసులో వున్న దావూద్ ఫొటో కనిపిస్తుందే తప్ప దాదాపు 60 ఏళ్ళ వయసు వచ్చిన అతని ఫొటో కనిపించదు. అసలు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా వున్నాడో. మన సీబీఐ చీఫ్‌కి ఇప్పుడు దావూద్ ఎదురుపడి టైమెంతైంది గురూ అని అడిగినా గుర్తుపట్టలేనట్టు వున్నాడేమో. అసలు దావూద్ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఇండియాలోనే హాయిగా బతికేస్తున్నాడేమో. ఈమధ్య మన దేశంలో దావూద్ గురించి దుమారం రేగుతోంది. దావూద్ లొంగిపోతానని అప్పట్లో అన్నాడని ఒక సీబీఐ పెద్దాయన చెప్పాడు. దావూద్ ఎక్కడున్నాడో తెలుసా అని పార్లమెంట్ సభ్యులు హోంశాఖ సహాయమంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చేశారు. మొత్తమ్మీద ఏమిటంటే, దావూద్‌ని పట్టుకోవడం మనవల్ల కాదుగానీ, ఆయన లేటెస్ట్ ఫొటోని అయినా మన దర్యాప్తు సంస్థలు సంపాదిస్తే అదే పదివేలు.