ఎయిర్‌పోర్టుకి పీవీ పేరు ఒప్పుకోం...

 

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కి తెలుగుతేజం నందమూరి తారక రామారావు పేరు పెట్టడం మీద విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ పీవీ నరసింహారావు, కొమరం భీమ్ లాంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేరు పెడితే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దీనిమీద అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే కేసీఆర్ చేసిన ప్రకటనను దక్షిణ తెలంగాణకు చెందిన అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణ మీద ఉత్తర తెలంగాణ ఆధిపత్యం పెరిగిపోయిందని, ఆ ఆధిపత్యమే కేసీఆర్ ప్రకటనలో కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఒకవేళ శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కి పీవీ నరసింహారావు పేరు పెట్టే ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అంటున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తామో కూడా వారు వివరిస్తున్నారు.

 

పీవీ నరసింహారావు ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు దక్షిణ తెలంగాణలో వుంది. ఈ ప్రాంతంలో వున్న ఎయిర్‌పోర్టుకు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరును ఎలా పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. పీవీ నరసింహారావు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు అనే విషయం ఒక కోణమైతే, పీవీ కుటుంబం కూడా కేసీఆర్ కుటుంబం తరహాలోనే సీమాంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిందని చరిత్రని తవ్వుతున్నారు. పీవీ నరసింహారావు పూర్వికులు కూడా సీమాంధ్ర గోదావరి ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణలో వున్న గోదావరి ప్రాంతానికి వలస వచ్చారని గుర్తు చేస్తు్న్నారు. ఇలా వలస వచ్చిన ఉత్తర తెలంగాణ వ్యక్తి పేరును దక్షిణ తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా, పీవీ నరసింహారావు రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించింది కూడా సీమాంధ్ర తెలుగువారుండే ఒరిస్సాలోని బరంపురం, రాయలసీమలోని నంద్యాల నియోజకవర్గాలు. ఆయన ఏదైనా సేవ, అభివృద్ధి చేసి వుంటే ఆ రెండు ప్రాంతాలకు చేసి వుంటారని, మరి అలాంటప్పుడు ఆయనకీ దక్షిణ తెలంగాణకీ సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పీవీ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరును ఎయిర్‌పోర్టుకు పెడతామని ప్రకటించడాన్ని కూడా తాము సహించబోమని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu