మొంథా ఎఫెక్ట్ ఇంకా ఉంది.. విపత్తుల శాఖ హెచ్చరిక
posted on Oct 29, 2025 10:29AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించిన మొంథా తుపాను తీరం దాటింది. ఇక క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పటికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన మొంథా.. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ పేర్కొంది.
కోస్తాంధ్రప్రాంతంలో మాత్రం ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న విపత్తుల సంస్థ.. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే చాన్స్ ఉందనీ పేర్కొంది. మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదనీ హెచ్చరించింది.