రాత్రి సచివాలయంలోనే సీఎం చంద్రబాబు...తుఫానుపై సమీక్ష
posted on Oct 28, 2025 9:53PM
.webp)
మొంథా తుఫాను తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టనుంది. దీంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండనున్నారు. పరిస్థితి అదుపులో తేవడానికి అధికారులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి ఐదారుగురితో ఓ బృందాన్ని పంపాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉంటే... ప్రజలకు నమ్మకం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు.. టెక్నాలజీని వినియోగించుకుని పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం సూచించారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేసుకోవాలని పేర్కొన్నారు.
నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలేశ్వరం, బుడమేరు తదితర వాగుల్లో ప్రవాహాలపై ఆరా సీఎం తీశారు. ఏలేశ్వరం రిజర్వాయరుకు రెండు రోజుల్లో 3 టీఎంసీల వరకూ ప్రవాహాలు రావొచ్చని అధికారులు వివరించారు. వరద నిర్వహణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం సూచనలు చేశారు. జిల్లాల్లోని పరిస్థితిని సీఎంకు ఫోన్ ద్వారా మంత్రులు నిమ్మల, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు వివరించారు.