తీరాన్ని తాకిన తుపాను....అతి భారీ వర్షాలు
posted on Oct 28, 2025 8:39PM
.webp)
మొంథా తుపాను తుఫాను కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిందని వాతావరణ అధికారులు తెలిపారు. యానం- అంతర్వేదిపాలేం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని ఐఎండీ వెల్లడించింది. తీర ప్రాంత జిల్లాల్లో గంటకు గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు.. తుపాన్ ప్రభావంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. దీంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ గాలుల తీవ్రతకు ఇప్పటికే పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో తీరప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని తెలిపారు. బంగాళాఖాతంలో 4 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతుండగా, తీరంలోకి 1 నుంచి 2 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీని ఆధారంగా కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.