తుపాను ఎఫెక్ట్... హైవేలపై భారీ వాహనాలు బంద్
posted on Oct 28, 2025 8:06PM

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తీవ్ర తుపాను తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నివారణ చర్యల్లో భాగంగా కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై మంగళవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరిజిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 6 గంటల వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనలను నిలిపివేస్తున్నాట్లు వెల్లడించారు.
కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సులని నిలిపివేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ ప్రకటించారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్‌కి రావొద్దని సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌కి వెళ్లే ప్రైవేట్ బస్సులు కూడా నిలిపివేశామని పేర్కొన్నారు. మరోవైపు తుఫాను కాకినాడ, మచిలీ పట్నం మధ్య తీరాన్ని తాకిందని వాతావరణ అధికారులు తెలిపారు.