Latest News
సైబర్ దాడులు.. కొత్త పుంతలు
posted on: Mar 29, 2026 11:40AM

నేటి డిజిటల్ యుగంలో సైబర్ దాడులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కేవలం సమాచార చోరీ, ఆర్థిక మోసాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. సైబర్ దాడులు మానవ మనుగడకు, ప్రాణాలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా చెప్పన మేరకు గతంలో కేవలం కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్లకే పరిమితమైన హ్యాకింగ్.. ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థలు, రవాణా. విద్యుత్ సరఫరా లాంటి కీలక ఇన్ ఫ్రాస్టక్చర్ కు కూడా పాకుతోంది. గత రెండేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ) మధ్య అంతరాలు సమసిపోయాయి. దీంతో విమానయానం, రవాణా, పబ్లిక్ యుటిలిటీ రంగాలకు పెను ముప్పు ప్రమాదం పొంచి ఉంది.
ఒక కనెక్టెడ్ కారును హైవేపై వేగంగా నడుపుతున్నప్పుడు, ఎవరైనా దానిపై సైబర్ దాడి చేసి స్టీరింగ్ నియంత్రణను దక్కించుకుంటే.. విమానం గాలిలో ప్రయాణిస్తుండగా, దాని ఆపరేషనల్ టెక్నాలజీ హ్యాక్ అయితే.. ఏం జరుగుతుంది. ఇప్పుడు సైబర్ దాడుల కారణంగా అలాంటి పెను ప్రమాదాలకు కూడా అవకాశం ఉందంటున్నారు డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా. సైబర్ దాడులతో ఆర్థిక చౌర్యం కంటే.. మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పుపైనే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోందంటున్నారాయణ. వైద్య రంగంలోనూ ఈ ముప్పు తీవ్రత అధికంగా ఉందని వివరించారు. ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలపై దాడి చేసి రోగుల డేటాను మార్చడం లేదా పరికరాల పనితీరును అడ్డుకోవడం వల్ల రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలపై సైబర్ దాడులు అంధకారాన్ని సృష్టిస్తాయంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉంటే, సుమారు 3000 కోట్లకు పైగా ఐఓటీ (IoT) సెన్సర్లు వాడుకలో ఉన్నాయని, అంటే సగటున ఒక వ్యక్తి చుట్టూ మూడున్నర సెన్సర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్న ఆయన ఈ దాడుల బారి నుంచి తప్పించుకోవడానికి ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పని తీరు ఆదర్శవంతంగా ఉందన్నారు.
ఇప్పటికే దాదాపు పాతిక దేశాలు తమ సొంత ఇండియా స్టాక్ రూపొందించుకోవడానికి డెలాయిట్ సలహాలు ఇస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల సైబర్ దాడుల వేగం, తీవ్రత కూడా పెరుగుతున్నాయన్నారు. సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలనీ. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే సైబర్ సెక్యూరిటీ ఎథిక్స్ గురించి బోధించాలని గౌరవ్ శుక్లా పిలుపునిచ్చారు.






