Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు
posted on: Jun 23, 2026 5:47PM

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార నిల్వ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.
తనిఖీల సందర్భంగా పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో కిచెన్, స్టోర్‌రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్లు ఉండటంతో దుర్వాసనతో పాటు ఈగల సమస్య కనిపించింది. స్టోర్‌రూమ్ సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, కూరగాయలు కట్ చేసే ప్రాంతాలు, గ్రైండింగ్ విభాగాల్లో నీరు నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కాలీఫ్లవర్‌పై ఫంగస్ పెరిగి ఉండటం, డ్రెయిన్ల వద్ద దుర్వాసన రావడం, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పిండిపై సరైన లేబులింగ్ లేకపోవడం కూడా బయటపడింది.
కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని వెల్లడించారు. ఆహార పదార్థాల లేబులింగ్, హౌస్‌కీపింగ్ ప్రమాణాలను మెరుగుపరచాలని సూచిస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ఇక నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్‌లో కూడా పలు లోపాలు బయటపడ్డాయి. చికెన్, డెజర్ట్స్ వంటి ఆహార పదార్థాలపై సరైన లేబుల్స్ లేకపోవడంతో వాటిని అధికారులు వెంటనే తొలగించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు లేకపోవడం గుర్తించారు. జిడ్డుగా మారిన కిచెన్ సీలింగ్‌ను తక్షణమే శుభ్రం చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో నిర్దేశిత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని రెస్టారెంట్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.






