Latest News
సైబర్ క్రిమినల్స్ కొత్త దందా... ఏఐ జనరేటెడ్ వీడియోతో వృద్ధురాలికి రూ.87 లక్షల టోకరా
posted on: Mar 16, 2026 2:45PM
.webp)
రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మంచి, చెడులు రెండింటికీ ఉపకరిస్తోంది. సాంకేతికత సమాజాభ్యున్నతికీ, మనవ జీవితం మరింత సౌకర్యవంతంగా మారడానికి దోహదపడటం వరకూ ఓకే.. కానీ అదే సమయంలో కొత్త కొత్త పద్ధతుల్లో సామాన్య జనాలను మోసం చేస్తున్న సంఘటనలు పెచ్చరిల్లడం ఆందోళన కలిగిస్తోంది. సాంకేతిక పరిజ్ణానంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు, అమాయకులను మోసం చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియోలు సృష్టించి జనాన్ని నమ్మించి అడ్డంగా దోచుకుంటున్నారు. తాజా సంఘటనలో సైబర్ నేరగాళ్ల ఏఐ జనరేటెడ్ వీడియోతో ఓ వృద్ధురాలిని మోసం కేసి ఏకంగా 87 లక్షల రూపాయలు కొట్టేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ వృద్ధురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్లుగా ఏఐ ఆధారిత వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమ యంలో భారీ లాభాలు వస్తాయని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ప్రజలకు సూచిస్తున్నట్లు చూపించారు. ఈ వీడియో చూసిన ఓ వృద్ధురాలు నిజమని నమ్మి అందులో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసింది. వెంటనే సైబర్ నేరగాళ్లు ఆమెను వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి ట్రేడ్‌అప్ అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఆపై ఆమె నుంచి ఐడీ ప్రూఫ్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరుతో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సృష్టించామని చెబుతూ మొదట రూ.60 వేలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం స్క్రీన్‌పై లాభాలు వస్తున్నట్లు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టారు. అది నిజమని పూర్తిగా నమ్మిన వృద్ధురాలు దఫదఫాలుగా మొత్తం రూ.87.96 లక్షలు కేటుగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది.
అయితే ట్రేడింగ్ అకౌంట్‌లో కనిపిస్తున్న డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా అనుమతి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని గుర్తించింది. దీంతో ఆమె మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






