ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసుల హెచ్చరిక
posted on Nov 5, 2025 4:22PM

హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ట్రేడింగ్ యాప్స్, డాష్ బోర్డులు సృష్టించి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి చేయమని ప్రోత్సహించి, తర్వాత నకిలీ లాభాలు చూపించి మరిన్ని డబ్బులు పెట్టమని ఒత్తిడి పెడతారని. లాభాలను విత్డ్రా చేయాలనగానే టాక్స్‌లు, ఫీజులు, కరెన్సీ కన్వర్షన్ ఛార్జీల పేరుతో మరిన్ని డబ్బులు అడుగుతారు. చివరికి బాధితులు తమ డబ్బు కోల్పోతారని పోలీసులు తెలిపారు.సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు.
సేబీ లైసెన్స్ ఉన్న సంస్థలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పోలీసులు పేర్కొన్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్‌లు ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దని వారు తెలిపారు. ఎవరైనా లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని భయపెడితే డబ్బులు చెల్లించకండని పేర్కొన్నారు. మోసపోయిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.