పసివాళ్లు.. పనివాళ్లు కాదు.. పిల్లల భవితకు సైబరాబాద్ పోలీసుల భరోసా
posted on: Feb 5, 2026 9:23AM

పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు, భిక్షాటనలో కాదు అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. చిన్నారుల చిరునవ్వులు పువ్వులు వికసించినట్లు ఉండాలి కానీ, వారి కనుల వెనుక విషాదం కూడదన్న లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు ముందుకు సాగుతున్నారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణ వేయించి, పిల్లల చేత భిక్షాటన చేయిస్తూ, పిల్లల భవితను, ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఐదుగురు మైనర్ బాలలు ఇటీవల ఇదే రీతిలో భిక్షాటన చేస్తుండగా, సైబరాబాద్ పోలీసులు వారిని రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, కొత్త జీవితాన్ని అందించారు.
ఈ విషయాన్ని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిచేత భిక్షాటన చేయిస్తున్న ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని సహించేది లేదని హెచ్చరించారు.
‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరమనీ, అలా చేయించేది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ వంటి మహనీయుల వేషధారణ కోసం పిల్లల శరీరంపై రంగులు పూయడం వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. అందుకే పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు అన్న నినాదంతో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నామన్నారు.






