Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సర్ పై విమర్శలు, బీజేపీ విధానాలపై మౌనం.. ఇదీ జగన్ రాజకీయ శైలి!
posted on: May 27, 2026 6:06PM
.webp)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓట్ల తొలగింపు అంశంపై తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీపై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరోసారి చాటాయి. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షాలు నష్టపోయాయన్న జగన్, ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ని కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట అనలేదు. ఎన్నికల ప్రక్రియలో పెద్ద లోపం జరిగిందని వేలెత్తి చూపిన జగన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని వేలెత్తి చూపడానికి మాత్రం ధైర్యం చేయలేదు.
బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన జగన్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతూ.. ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పశ్చిమ బెంగాల్‌లో సుమారు 91 లక్షల ఓట్లు, అలాగే తమిళనాడులో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగిపోయాయన్నారు. ఈ ఓట్ల తొలగింపు కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పరాజయం పాలయ్యాయన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
దేశంలోని ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు చేసిన జగన్.. దీని వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్రను కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తాయి.. కానీ జగన్ కేవలం ఎన్నికల సంఘం వ్యవస్థాగత లోపాలే ఓట్ల తొలగింపునకు కారణమని విమర్శలు గుప్పించి చేతులు దులిపేసుకున్నారు.
గత కొంతకాలంగా వైఎస్ జగన్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన బుధవారం (మే 27) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు బలం చేకూర్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శించేందుకు జగన్ సిద్ధంగా లేరని తాజా ప్రెస్ మీట్ మరో సారి నిర్ద్వంద్వంగా నిరూపించింది. వ్యవస్థలను తప్పుబడుతూనే, కేంద్ర పెద్దలను నొచ్చుకోకుండా మాట్లాడటం జగన్ రాజకీయ శైలిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
. మొత్తంగా రాష్ట్రంలో తన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంను తీవ్రంగా విమర్శిస్తూనే.. ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసుల భయంతోనే జగన్ బీజేపీకి వంతపాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






