సూర్యవంశీ వైభవ్‌కు టాటా మోటార్స్ లగ్జరీ కారు గిఫ్ట్

posted on: Feb 24, 2026 6:46PM

 

భారత్ క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాడు. ఇటీవలే జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో సెంచరీతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2025లో అతిపిన్న వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసి మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అండర్ 19 ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా పరుగులు సాధించినందుకు అతడికి ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు లభించింది. 

ఈ ఘనత సాధించినందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తమ లేటెస్ట్ మోడల్ ‘టాటా కర్వ్’ కారును బహుమతిగా అందజేసింది. టాటా కర్వ్ కారు ధర టాప్ వేరియంట్ రూ. 18.85 లక్షల వరకు ఉంది.బిహార్ రాజధాని పాట్నాలోని టాటా షోరూంలో వైభవ్ సూర్యవంశీ తన తండ్రి, తమ్ముడితో కలిసి ఈ కొత్త కారును డెలివరీ తీసుకున్నారు. ఈ సందర్భంగా షోరూం సిబ్బంది వైభవ్ కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. కారు కీని అందుకుని కేక్ కట్ చేశారు. 

అయితే వైభవ్ సూర్యవంశీ వయస్సు ప్రస్తుతం 18 ఏళ్ల లూపే ఉండటంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనివల్ల అతడు సొంతంగా కారును నడిపే అవకాశం లేదు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్.. ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన విషయం తెలిసిందే. భారత్‌కు రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ రావడంలో కీలకపాత్ర పోషించాడు. కేవలం 55 బంతుల్లో శతకం పూర్తి చేసి టోర్నీలో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 

మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 439 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. టోర్నీలో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే 14 ఏళ్ల 32 రోజుల వయసులో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...