Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు
posted on: Mar 10, 2026 3:10PM
.webp)
తెలుగు సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. రాజధానిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులు, సచివాలయం మరియు హెచ్ఓడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై సమావేశంలో చర్చించారు. సీఆర్డీఏ నుంచి వచ్చిన పలు ప్రతిపాదనలకు అథార్టీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మొత్తం 167 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు.ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ వంటి విభాగాలు ఉండనున్నాయి. పర్యాటకంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా వాతావరణం కల్పించాలని సూచించారు. అలాగే హోటళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేసి ప్రాంతాన్ని అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని తెలిపారు.
భవిష్యత్తులో క్రీడా రంగం పెద్ద ఆదాయ వనరుగా మారుతుందని సీఎం అన్నారు. బీసీసీఐ, ఐసీసీ వంటి సంస్థలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసిన క్రికెట్ బోర్డులు ఇప్పుడు భారీ ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగాయని తెలిపారు. ఇదే విధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియల్ రంగంగా మారే అవకాశముందని చెప్పారు.అమరావతిలో ప్రతిపాదించిన స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా ఇదే దిశగా రూపొందించామని సీఎం వివరించారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ కాలంలో సైబర్ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఇప్పుడు చింతిస్తున్నాయని చెప్పారు. ఈసారి అమరావతిలో అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని సంస్థలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.
అమరావతిలో నిర్మించబోయే తెలుగు కల్చరల్ సెంటర్‌కు మంచి పేరును పరిశీలించాలని సీఎం సూచించారు. అలాగే రాజధానిలో పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి శాఖ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.






