Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాఫియా డాన్లపై ఉక్కుపాదం.. సువేందు సర్కార్ అండర్ వేర్ మోడల్ శిక్షలకు ప్రశంసలు
posted on: May 29, 2026 2:46PM

పశ్చిమ బెంగాల్ రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన మాఫియా వ్యవస్థ, అక్రమ వసూళ్లు, సిండికేట్ రాజ్యానికి ముగింపు పలికేలా ప్రస్తుత పాలనలో కఠినమైన చర్యలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడమే ధ్యేయంగా నేరగాళ్లపై సరికొత్త వ్యూహాన్ని అధికారులు ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు సామాన్య ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను నడిరోడ్డుపై లోదుస్తులతో ఊరేగిస్తూ వారి అహంకారాన్ని అణచివేసే ప్రక్రియ బెంగాల్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సమాంతర పాలన సాగిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న రౌడీ మూకల పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ కఠిన వైఖరి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో పశువుల అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ సిండికేట్ దందా, తోలాబాజీ పేరిట సాగిన హఫ్తా వసూళ్ల నెట్‌వర్క్ చాలా బలంగా విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు అగ్రనేతల ఆశీస్సులతోనే ఈ మాఫియా సామ్రాజ్యం యథేచ్ఛగా సాగిందని, ఢిల్లీలోని కొన్ని రాజకీయ శక్తులు కూడా దీనిని చూసీచూడనట్లు వదిలేశాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేరస్థులను కేవలం జైలుకు పంపితే సరిపోదనీ.. వారు ఏ వీధుల్లోనైతే ప్రజలను భయపెట్టారో.. అదే వీధుల్లో వారిని బహిరంగంగా అవమానించడం ద్వారానే నేర ప్రవృత్తికి అడ్డుకట్ట వేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని బుల్డోజర్ చర్యలను మించిపోయేలా ఇక్కడ ‘లోదుస్తుల కవాతు’ సరికొత్త శిక్షా నమూనాగా రూపాంతరం చెందింది.
హౌరా ప్రాంతాన్ని ఒకప్పుడు తన గుప్పిట్లో ఉంచుకుని శాసించిన ప్రముఖ మాఫియా డాన్ ఆకాష్ సింగ్‌కు ఈ విధానం ద్వారానే పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. ఉత్తర హౌరా, గోలబారి, మాలి పంచఘర పరిధిలో డజన్ల కొద్దీ నేరాలకు పాల్పడటమే కాకుండా.. పోలీసులపైనే కాల్పులు జరిపిన చరిత్ర ఆకాష్ సింగ్‌కు ఉంది. ఇటువంటి ప్రమాదకరమైన నేరస్థుడిని మే 14న అరెస్టు చేసిన భద్రతా దళాలు, అతనికి శిరోముండనం చేయించి, కేవలం బాక్సర్ షార్ట్స్, చేతులు లేని బనియన్‌తో సంకెళ్లు వేసి క్రైమ్ జోన్ వీధుల్లో నడిపించాయి. ఒకప్పుడు అతడి పేరు చెబితేనే గజగజ వణికిన స్థానిక ప్రజలు, తమ కళ్ల ముందే ఆ డాన్ నిస్సహాయంగా నడుచుకుంటూ వెళ్లడం చూసి హర్షం వ్యక్తం చేశారు.
ఇదే తరహాలో, రాజకీయ అండదండలతో బాంబు దాడులు, అక్రమ భూఆక్రమణలు, జూద గృహాలు నడిపిన షమీమ్ అహ్మద్ అనే మరో కీలక నేరస్థుడిని కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. మే 21న అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఏ ప్రాంతంలోనైతే అతడు నేర సామ్రాజ్యాన్ని నడిపాడో, అదే ప్రాంతంలో లోదుస్తులతో బహిరంగంగా ఊరేగించారు. సమాజంలో భయోత్పాతం సృష్టించే ఏ నేరగాడికైనా చట్టం ముందు ఇదే గతి పడుతుందనే బలమైన సందేశాన్ని ఈ చర్యల ద్వారా సుంవేదు అధికారి ప్రభుత్వం ప్రజలకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. చట్టపరమైన శిక్షల కంటే ఇలాంటి నైతిక పరాభవం నేరస్థుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, హౌరా, బెల్తలా, సంక్రైల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడిన షాహిన్ మొల్లా అనే నిందితుడి విషయంలోనూ పోలీసులు ఇలా కఠిన వైఖరినే ప్రదర్శించారు. తాను ధరించిన పొడవాటి బాక్సర్ షార్టులను సాధారణ పైజామాలుగా చూపించి సమాజాన్ని పక్కదారి పట్టించడానికి అతడు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు మాత్రం వాటిని లోదుస్తులుగానే పరిగణించి బహిరంగంగా నడిపించారు. అలాగే ఉత్తర 24 పరగణాల బీచ్ పూల్ పరిధిలో అసాంఘిక ముఠాను నడిపిన అభిజిత్ రాయ్ అలియాస్ బోనీని సైతం తాడుతో కట్టి, లోదుస్తులతో వీధుల్లో తిప్పినప్పుడు స్థానికులు సైతం ‘దొంగ, దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
బెంగాల్‌లో ఇంతటి ఘోరమైన మాఫియా సంస్కృతి రాజ్యమేలుతున్నా, దేశంలోని ప్రముఖ బాలీవుడ్ నటులు, క్రీడా ప్రముఖులు అనుసరిస్తున్న మౌనంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత పాలకులతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా చలామణీ అయిన షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు ఈ అరాచకాలపై ఎందుకు నోరు మెదప లేదని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. బెంగాల్ వీధుల్లో గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యం కూలిపోతున్న దృశ్యాలను చూసిన తరువాతనైనా వారు స్పందించాలని, ప్రజా పక్షాన నిలబడి నేర రహిత సమాజం కోసం గొంతు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సందేశ్‌ఖాలి ప్రాంతంలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారాల ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్‌ను సైతం ఇదే తరహాలో ‘లోదుస్తుల కవాతు’ ద్వారా శిక్షించాలనే డిమాండ్లు ప్రజా సంఘాల నుండి బలంగా వినిపిస్తున్నాయి. మహిళలపై దారుణమైన అకృత్యాలకు పాల్పడిన ఇలాంటి నేరగాళ్లను సమాజం ముందు నిలబెట్టినప్పుడే, బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయడానికి ఎవరూ సాహసించరని ప్రజలంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న అండర్‌వేర్ మోడల్, బుల్డోజర్ రాజకీయాలు నేర నియంత్రణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. చట్టపరమైన ప్రక్రియల ద్వారా కోర్టుల్లో శిక్షలు పడటానికి సంవత్సరాల కాలం పడుతుండటంతో, తక్షణ ఉపశమనం, అలాగే సమాజంలో భయాన్ని పోగొట్టడానికి ఈ వ్యూహం విజయవంతంగా పనిచేస్తోందని క్షేత్రస్థాయి పరిశీలనలు చెబుతున్నాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.



.webp)


