Latest News

కమ్యూనిస్టుల కితకితలు!

posted on: Mar 24, 2014 4:17PM

 

 

 

ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు తెలుగు ప్రజలకు కితకితలు పెట్టి నవ్వించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాకపోతే, వాళ్ళు కితకితలు పెడుతుంటే నవ్వు రావడానికి బదులు ఏడుపు వస్తూ వుండటమే బ్యాడ్‌లక్. నిన్నటి వరకూ ఉప్పూ నిప్పుల్లా వున్న సీపీఎం, సీపీఐ పార్టీలు ఎన్నికలు రాగానే భుజాల మీద చేతులు వేసుకున్నాయి. నిన్నటి వరకూ ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్న ఈ రెండు పార్టీల నాయకులు కలసి ప్రెస్ మీట్లు పెట్టి కిలకిలా నవ్వుకుంటూ మీడియాకి పోజులిస్తున్నారు. ఇదిలా వుంటే, సీపీఐ నాయకుడు నారాయణ చిన్నప్పుడు చదువుకున్న ‘తనకు మాలిన ధర్మం మొదలు చెడిన బేరం’ అనే సామెతని మరచిపోయినట్టున్నాడు. అందుకే తనకు సంబంధం లేని పనులని భుజాన వేసుకుని లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

ఇంతకీ ఆ పనేంటయ్యా అంటూ, ప్రస్తుతం రాష్ట్రంలో తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తెగ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా, మధ్యలో నిన్ను రాయబారి చేయమని ఎవరైనా అడిగారా అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నాడు. ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తాను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కలిపే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అవకాశం వుందని అంటున్నాడు. నారాయణ గారి బుర్రలో వున్నది తెలంగాణ ప్రజల మేలు కాదని, ఈ రెండు పార్టీలకు సయోధ్య కుదిర్చి రాజకీయంగా లాభం పొందే ఆలోచనలో ఆయన ఉన్నారన్నది ఎంత అమాయకులకైనా అర్థమైపోయే విషయం.



అంచేత నారాయణ ఇలాంటి సూపర్ తెలివితేటల ప్రదర్శన మానుకుని నిజంగా జనానికి ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని విమర్శకులు సలహా ఇస్తున్నారు. ఇదిలా వుంటే, నిన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న సీపీఎం ఇప్పుడు విభజన కోరుకున్న పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహం కుదుర్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఈ స్నేహం కోసం ఈ పార్టీ ఎంత దిగజారిందంటే, చివరికి నిన్నగాక మొన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వాగిన చెత్త మొత్తం భేషుగ్గా వుందని కితాబు ఇచ్చింది.  ఇలాంటి రాజకీయాలు నడుపుతారు కాబట్టే కమ్యూనిస్టులు ప్రజలకి దూరమైపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...