మహిళల చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేదు : సీపీ వీసీ సజ్జనర్
posted on Nov 10, 2025 5:03PM

మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. మహిళల భద్రత, రక్షణ అనేది సామాజిక బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సోమవారం మహిళా భద్రత విభాగం పనితీరుపై సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ విభాగంలోని మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను ఆరా తీశారు. షీటీమ్స్, భరోసా, యాంటీ హుమన్ ట్రాఫికింగ్, జువైనల్, తదితర విభాగాల పోలీస్ అధికారులతో మాట్లాడి.. వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా భద్రత విషయంలో వ్యవహారించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.
మహిళలు బాధతో పోలీస్ స్టేషన్లకు వస్తారని, వారితో మానవత దృక్పథం వ్యవహారించాలని సూచించారు. అన్యాయం జరిగిందని వచ్చే బాధిత మహిళకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలన్నారు. కేవలం కేసులు నమోదు చేసి వదిలేయొద్దని, సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. పొక్సో, అత్యాచార కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహిళా భద్రతపై అవగాహన కల్పించాలని, చిన్నపిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్వీయరక్షణ విషయాలు నేర్పాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ వీధి బాలలు, వెట్టిచాకిరి, పరిశ్రమల్లో మగ్గుతున్న బాలకార్మికులను రక్షించాలని ఆదేశించారు. ఆడపిల్లల జోలికి వస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. వారికి పాస్‌పోర్ట్ మంజూరు కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్ , డీసీపీ లావణ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.