శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పాత్ర కీలకం : సీపీ వీసీ సజ్జనర్
posted on Nov 8, 2025 2:02PM

శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగ సిబ్బంది పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. హైదరాబాద్ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం జరిగిన సెరిమొనియల్ పరేడ్‌లో హైదరాబాద్ సీపీ పాల్గొన్నారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్రగల సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగానికి మంచి పేరు ఉందని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే పోలీస్ ఉద్యోగం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. కుటుంబసభ్యులకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలన్నారు.
ప్రతి ఒక్కరు సమయాన్ని వృథా చేయకుండా నైపుణ్యాన్ని నేర్చుకోవాలని, వృత్తి రీత్యా పోలీస్ శాఖలో వస్తోన్న నూతన పోకడలను అందిపుచ్చుకోవాలన్నారు. కాగా, ఏఆర్ కు చెందిన 1044 మంది ఈ పరేడ్ ని నిర్వహించారు. అందులో సిటీ సెక్యూరిటీ గార్డు, స్వాఫ్ట్, క్వీక్ రియాక్షన్ టీమ్, సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
పరేడ్ అనంతరం ఏఆర్ సిబ్బందితో నేరుగా సీపీ మాట్లాడారు. పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో తలెత్తతున్న ఇబ్బందులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకురాగా, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తర్వాత సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణాన్ని సందర్శించారు. క్రెచ్, ఆర్మ్స్ అండ్ అమ్మునిషన్ స్టోర్ రూమ్, ఆర్మ్స్ వర్క్ షాప్, బ్యారక్స్ వంటి అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హెడ్ క్వార్టర్స్‌లోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. మెరుగైన పోలీసింగ్ కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి , అదనపు డీసీపీలు ఎన్. భాస్కర్, బి. కిష్టయ్య , టి. కరుణాకర్ , డి. సంజీవ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.