Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అర్ధరాత్రి సీపీ సుమతి స్టింగ్ ఆపరేషన్ ...వేధించిన 40 మంది పోకిరీలు
posted on: May 6, 2026 1:20PM

నగరంలో లేడీ సింగం మెరుపు దాడి...
అర్ధరాత్రి సాధారణ మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి..
షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోకిరీలు..
నగరంలో మహిళల భద్రత ఎంతవరకు ఉందనే విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, పోలీసు వాహనాలు కాకుండా ఒక సాధారణ మహిళగా అర్ధరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు నగరంలో మహిళల భద్రతపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
ఇటీవలే మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుమతి, మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఆమె అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. సాదాసీదా దుస్తుల్లో ఒక సగటు మహిళలా బస్టాండ్ లో ఒంటరిగా వేచి ఉన్న సమయంలో, అక్కడ ఉన్నది సాక్షాత్తు కమిషనర్ అని తెలియని పోకిరీలు తమ వక్రీకృత బుద్ధిని ప్రదర్శించారు.

బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్న సుమారు 40 మంది యువకులు ఆమె చుట్టూ చేరి అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించడం ప్రారంభించారు. రాత్రివేళ ఒంటరిగా ఉన్న మహిళను చూసి ఆకతాయిలు ఎంత తెగించి ప్రవర్తిస్తారనేది ఈ ఘటనతో స్పష్టమైంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, మద్యం మత్తులో ఉన్న యువకులు ఉండటం గమనార్హం.
మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా అనుభవించిన సీపీ, వెంటనే అప్రమత్తమై తన టీమ్‌కు సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటికే అక్కడ మాటు వేసిన పోలీసులు మెరుపు వేగంతో స్పందించి వేధింపులకు పాల్పడిన వారిని చుట్టుముట్టారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ ఆపరేషన్ ద్వారా నగరంలో రాత్రివేళల్లో భద్రతా లోపాలను సీపీ స్వయంగా గుర్తించారు. ముఖ్యంగా బస్టాండ్లు, హాస్టల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. మద్యం, గంజాయి మత్తులో యువత దారి తప్పుతున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అధికార యంత్రాంగం కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా, ఇలా క్షేత్రస్థాయిలోకి వచ్చి వాస్తవాలను తెలుసుకోవడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సుమతి తీసుకున్న ఈ చొరవ వల్ల ఆకతాయిల్లో భయం మొదలైందని, భవిష్యత్తులో ఇలాంటి నిఘా చర్యలు మరిన్ని కొనసాగుతాయని ప్రజలు భావిస్తున్నారు.

రానున్న రోజుల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక ఐటీ ఆధారిత వ్యవస్థలను (TG QUEST వంటివి) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. నగర వీధుల్లో మహిళలు నిర్భయంగా తిరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, వేధింపులు మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇంటి బయట అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






