పగబట్టిన ఆవు!

posted on: Nov 4, 2025 11:24AM

సాధారణంగా పాములు పగపడతాయని విన్నాం. పాములు పగబడతాయనడానికి శాస్త్రీయ ఆధారం ఏమీ లేకపోయినా.. పాము పగ అన్నది ఒక నానుడిగా మారిపోయింది. కానీ ఒక ఆవు పగపట్టినట్లుగా వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ ఆవు పగబట్టినట్లుగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు భయం గొల్పుతున్నాయి.  

ఓ వ్యక్తి సోమవారం (నవంబర్ 3) అర్ధరాత్రి సమయంలో తన ఇంటి ముందుకు వచ్చి బైక్ పార్క్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆవు అతనిపై దాడి చేసింది.  ఆవు నుండి తప్పించుకునేందుకు అతను విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు... ఆవు అతనిపై దాడి చేస్తుండగా... గట్టి గట్టిగా ఆర్తనాదాలు చేశాడు.

అటువైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహన దారుడు ఆవును తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మరి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆవును తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఆవు మాత్రం తన దాడిని ఆపలేదు. చివరకు ఓ వ్యక్తి పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఆవుపై అమాంతం దాడి చేయడంతో ఆవు బాధితుడిని అక్కడే వదిలేసి  పారిపోయింది. ఈ ఘటనలో ఆవుదాడికి గురైన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు... ఆవుదాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...