సత్ఫలితాలిస్తున్న భారత్, చైనా నియంత్రిత శత్రుత్వం

posted on: Jun 6, 2026 4:21PM

భారత్-చైనా సంబంధాలు  నియంత్రిత శత్రుత్వం అనే కొత్త దశలో కొనసాగుతున్నాయి. 2020 నాటి గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు, ఇటీవల బీజింగ్ చర్చలతో ఒక కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. 2020 జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలం నాటి శాంతిని భగ్నం చేసింది. దాని ఫలితంగా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి రెండు దేశాల సైనిక మోహరింపు భారీగా పెరిగింది. ఆ క్రమంలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య సుదీర్ఘ దౌత్య, సైనిక చర్చలు జరిగాయి.

అక్టోబర్ 2024లో కుదిరిన ఒప్పందం మేరకు, డెప్సాంగ్ , డెమ్చోక్‌లలో పెండింగ్‌లో ఉన్న ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. దీనివల్ల గల్వాన్  ఉద్రిక్తతల తర్వాత ఏర్పడిన తీవ్ర ప్రతిష్టంభనకు తెరపడింది. 2024 అక్టోబర్‌లో కజకిస్తాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల సంబంధాలు గాడిలో పడ్డాయి. తర్వాత ఈ ఏడాది మే నెలలో బీజింగ్ వేదికగా జరిగిన 35వ డబ్ల్యూఎంసీసీ సమావేశంలో సరిహద్దుల్లో శాంతిపై రెండు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. 

సైనిక ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం భారత్‌కు భారీ లోటుతో స్థిరంగా పెరుగుతూ వచ్చింది. భద్రతా సమస్యల దృష్ట్యా, భారత్ చైనా పెట్టుబడులను నియంత్రిస్తూనే, అవసరమైన మేరకు ఆర్థిక పరస్పర చర్యలను కొనసాగిస్తోంది. సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నప్పటికీ, వాటిని మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను శాసించే స్థాయికి చేర్చకుండా, నియంత్రిత పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ధోరణి బలపడింది. మరోవైపు, భారతదేశం ఎల్ఏసీ వెంబడి నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, హిందూ మహాసముద్రంలో  తన వ్యూహాత్మక బలాన్ని పెంచుకుంటోంది. 

మొత్తానికి గల్వాన్ సంక్షోభం తర్వాత చైనా వైఖరిలో వచ్చిన మార్పును భారత్ సునిశితంగా గమనిస్తోంది. యుద్ధానికి దూరంగా ఉంటూనే, తమ భూభాగాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా, అదే సమయంలో వాణిజ్య, దౌత్య మార్గాలను తెరిచి ఉంచడమే "నియంత్రిత శత్రుత్వం" యొక్క అసలు అంతరార్థంగా చెప్తున్నారు. నియంత్రిత శత్రుత్వంఅనే కొత్త ఫార్ములాతో రెండు దేశాలుముందుకు సాగుతుండటంతో ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోకపోయినా , చర్చలు కూడా నడుస్తాయి.  ఆ ఫలితమే 2025లో భారత్-చైనా ద్వైపాక్షిక వ్యాపారం సుమారు రూ.13.1 లక్షల కోట్లు రికార్డు స్థాయికి చేరింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    
 

google-ad-img
    Related Sigment News
    • Loading...