టీ సర్కారు మెడలో ‘ఒప్పంద’ పాము
posted on May 4, 2015 9:02PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరికోరి మెడలో వేసుకున్న ‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ’ పాము ఇప్పుడు ఆయనకే పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన అనేక హామీలు, వాగ్దానాల్లో ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ కూడా ఒకటి. తెలంగాణ ఏర్పడటం ఆలస్యం రాష్ట్రంలో వున్న ఒప్పంద కార్మికులందర్నీ క్రమబద్ధీకరించేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఒప్పంద ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయని, ఆంధ్రావాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు అందరి మీద బాగా పనిచేశాయి. ముఖ్యంగా అప్పటికే ఒప్పంద ఉద్యోగుల హోదాలో వున్నవాళ్ళ మీద బాగా పనిచేశాయి. ఖాళీ అయిన ఉద్యోగాల్లో తమనే తీసుకుంటారని వారు భావించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హామీ ఇచ్చినంత వేగంగా పని జరగలేదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉద్యమం చేసింది తామయితే, తమకు ఉద్యోగాలు రాకుండా ఒప్పంద ఉద్యోగులు చేస్తున్నారంటూ విద్యార్థులు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకించారు.
ఒకవైపు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు... మరోవైపు ఒప్పంద ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాల్సిందేనని పట్టుదలతో వున్నారు. దాంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పరిస్థితి తయారైంది. దీనికితోడు తాజాగా విద్యుత్ శాఖలో వున్న వేలాది మంది ఒప్పంద ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అంటూ ఆందోళన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వున్న వేలాది మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు... అలాగని ఇచ్చిన హామీ నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితీ లేదు. ఒకవేళ ఇచ్చిన మాట మీద నిలబడితే విద్యా్ర్థులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అధికారులు ఏమంటారో, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుందో లేదో... మరి ముఖ్యమంత్రి గారు తన మెడకు చుట్టుకుని వున్న ఈ పామును చాకచక్యంగా వదిలించుకుంటారో... మరి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.