పాకిస్థాన్ లో సైనిక ఆధిపత్యానికి రాజ్యాంగ రక్షణ కవచం

posted on: May 7, 2026 3:22PM

పాకిస్తాన్ రాజకీయాల్లో ముఖచిత్రాలు మారవచ్చు, ప్రధానమంత్రులు మారవచ్చు..  కానీ అధికారం   అసలు కేంద్రం మాత్రం ఎప్పుడూ  రావల్పిండి (సైనిక ప్రధాన కార్యాలయం) కేంద్రంగానే ఉంటుంది. దశాబ్దాలుగా ఆ దేశంలో ప్రజాస్వామ్యం అనేది సైన్యం గీసిన ఎర్రగీతల లోపల మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం పాక్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే..  సైన్యం తన పట్టును మరింత బిగించిందనీ..  కేవలం పాలనా పద్ధతిని మాత్రమే మార్చిందని స్పష్టమవుతోంది.  ప్రత్యక్షంగా దేశాన్ని ఏలడం కంటే..  పౌర ప్రభుత్వాన్ని ముందుంచి వెనుక నుండి చక్రం తిప్పే  హైబ్రిడ్ మోడల్  ఇప్పుడు అక్కడ రాజ్యమేలుతోంది.  చారిత్రక నమూనాను పరిశీలిస్తే..  అయూబ్ ఖాన్ కాలం నుండీ కూడా పాకిస్తాన్ ఒకే రకమైన రాజకీయ చక్రాన్ని అనుసరిస్తోంది. అది నేరుగా సైనిక పాలన (మార్షల్ లా) కావచ్చు లేదా సైన్యం నియంత్రించే  మేనేజ్డ్ డెమోక్రసీ కావచ్చు. పౌర నాయకులు తమ పరిధిని దాటి స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రయత్నించిన ప్రతిసారీ, సైన్యం జోక్యం చేసుకుని వారిని గద్దె దించుతూ వచ్చింది. జియా-ఉల్-హక్ నుండి ముషారఫ్ వరకు అందరూ ఇదే బాటలో నడిచారు. 

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది సైనిక వ్యవస్థ అనుమతించినంత వరకే మనుగడ సాగిస్తుందనేది కాదనలేని  కఠిన సత్యం.  ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ నేతృత్వంలో ఈ ఆధిపత్యం సరి కొత్త స్థాయికి చేరుకుంది. దేశ విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, భారత్,  చైనా వంటి కీలక దేశాలతో సంబంధాలు, చివరకు అణు ఆయుధాల నియంత్రణ కూడా పూర్తిగా సైన్యం చేతుల్లోనే ఉన్నాయి. పౌర ప్రభుత్వం కేవలం ఒక ముఖచిత్రంగా మాత్రమే కనిపిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి,  గల్ఫ్ దేశాలతో జరిగే ఆర్థిక ఒప్పందాలకు కూడా సైన్యం ఇచ్చే హామీనే అత్యంత కీలకంగా మారుతోంది. ఆ దేశంలో పౌర నాయకుల కంటే ఆర్మీ చీఫ్ మాటకు ఉన్న ప్రాధాన్యత అంతర్జాతీయ వేదికలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.  పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీల బలహీనతలు కూడా సైన్యానికి వరంగా మారుతున్నాయి. 

పీఎంఎల్-ఎన్, పీపీపీ లేదా పీటీఐ వంటి ప్రధాన పార్టీలన్నీ వారసత్వ రాజకీయాలు,  వ్యక్తిగత ఆరాధనల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పార్టీలు ప్రజా మద్దతు కంటే సైన్యం యొక్క ప్రాపకం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తాయి. పౌర నాయకుల మధ్య ఉండే విభేదాలు, బలహీనమైన వ్యవస్థలు సైన్యానికి ఒక మధ్యవర్తి  పాత్రను పోషించే అవకాశాన్ని సులభంగా అందిస్తున్నాయి. మీడియాపై నియంత్రణ,  సెన్సార్‌షిప్ ద్వారా సైన్యం తన వ్యతిరేక గళాన్ని నొక్కివేస్తోంది.  ఇటీవల కాలంలో  హైబ్రిడ్ మిలిటరైజ్డ్ లీగలిజం అనే కొత్త ధోరణి అక్కడ కనిపిస్తోంది. అంటే సైన్యం తన ఆధిపత్యాన్ని కేవలం తుపాకులతో కాకుండా, చట్టబద్ధంగా శాశ్వతం చేసుకుంటోంది. 

2025లో ఆమోదించిన 27వ రాజ్యాంగ సవరణ ఇందుకు నిదర్శనం. ఈ సవరణ ద్వారా ఆర్మీ చీఫ్‌ను  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మార్చడమే కాకుండా, ఆయనకు అపరిమితమైన అధికారాలను మరియు చట్టపరమైన రక్షణను కల్పించారు.  సుప్రీంకోర్టు కంటే శక్తివంతమైన  ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్  ఏర్పాటు కూడా సైనిక ప్రయోజనాలను కాపాడటానికేనని విశ్లేషకుల అభిప్రాయం.  ఆర్థిక సంక్షోభం కూడా సైన్యం తన పట్టును పెంచుకోవడానికి తోడ్పడుతోంది. విదేశీ పెట్టుబడిదారులు,  రుణదాతలు పాక్ రాజకీయ అస్థిరతను చూసి భయపడుతుండటంతో..  ఆర్మీ ఇచ్చే గ్యారంటీ వారికి భరోసానిస్తోంది. దీనివల్ల రాజకీయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక విషయాల్లో కూడా సైన్యం నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో మళ్ళీ నేరుగా సైనిక పాలన వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ..  రాజ్యాంగ ముసుగులో సాగే ఈ  మేనేజ్డ్ డెమోక్రసీ సుదీర్ఘ కాలం కొనసాగేలా కనిపిస్తోంది.  నిజమైన మార్పు రావాలంటే పాకిస్తాన్‌లో మూడు కీలక షరతులు నెరవేరాల్సి ఉంటుంది. ఒకటి.. పార్లమెంట్, న్యాయవ్యవస్థ,  మీడియా వంటి పౌర సంస్థలు బలోపేతం కావాలి. రెండు..  బాహ్య రుణాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవాలి. మూడు..  రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, సైన్యాన్ని పాలనకు దూరంగా ఉంచాలనే కనీస అంగీకారానికి రావాలి. అయితే ప్రస్తుతం ఈ మూడు సంకేతాలు పాకిస్తాన్ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీనివల్ల సమీప భవిష్యత్తులో సైన్యమే కేంద్రంగా సాగే ఈ హైబ్రిడ్ పాలన కొనసాగక తప్పదు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...