విషమంగా కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి!

posted on: Jan 30, 2026 3:41PM

 

నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు హైదరాబాద్ నిమ్స్  వైద్యులు విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆమె పరిస్థితి నిలకడగా లేకపోవడం కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ శాఖ అధికారుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

25 ఏళ్ల వయసున్న సౌమ్యను జనవరి 25, 2026న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. జనవరి 30 నాటికి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉండి, లైఫ్ సపోర్ట్‌పై కొనసాగుతున్నారు. ప్రమాదంలో కలిగిన తీవ్ర గాయాల కారణంగా సౌమ్య యొక్క కాలేయ పనితీరు గణనీయంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. దీనివల్ల రక్తంలో అమ్మో నియా స్థాయిలు ప్రమాద కరంగా పెరిగాయని, వాటిని తగ్గించేందుకు డయాలసిస్ ఆధారిత చికిత్సలతో పాటు ఇతర అత్యవసర వైద్య చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 

అమ్మోనియా స్థాయిలను నిశితంగా, పదేపదే పర్యవేక్షిస్తున్నామని వైద్య బృందం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇమేజింగ్ పరీక్షల్లో మెదడు వాపు  ఉన్నట్లు తేలిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. అధునాతన పరికరాలతో ఆమెను 24 గంటలూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలకు చెందిన నిపుణులు సమన్వ యంతో నిర్వహిస్తున్నారని వైద్యులు తెలిపారు. 

క్రిటికల్ కేర్ బృందం అత్యంత అప్ర మత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రోగి పరిస్థితి అత్యంత తీవ్రమైనదే అయి నప్పటికీ, అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యాన్ని స్థిరీకరిం చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నామని నిమ్స్ వైద్య బృందం స్పష్టం చేసింది.

నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా గంజాయిని స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. ఎక్సైజ్  అధికారులు మాధవనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. టీఎస్ 24 AF 4892 నంబరు గల కారులో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు  అబ్కారీ బృందం ప్రయత్నించింది. అయితే.. అధికారుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్మగ్లర్లు తమ కారును అధికారుల మీదికి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బంది తప్పించుకున్నప్పటికీ.. కానిస్టేబుల్ సౌమ్యను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలవడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
  

google-ad-img
    Related Sigment News
    • Loading...