పేలుళ్లను మించిన కుట్ర.. రిసిన్ విష ప్రయోగం
posted on Nov 11, 2025 8:54AM

రుచిలేని విషం రిసిన్... ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన విషాలలో ఇదీ ఒకటి. దీని స్పెషాల్టీ ఏంటంటే రుచి ఉండదు, వాసన ఉండదు. గ్లాసు నీటిలో కలిపినా, కూడా అనుమానించలేరు. మృత్యువు ఆహారం రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందని కూడా ఎవరూ గుర్తించలేరు. అటువంటి అత్యంత ప్రమాదకరమైన విషం రిసీన్.
డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్... తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఈ రిసిన్ ని ఎలా తయారు చేస్తారంటే.. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రిసిన్ సేకరిస్తారు, తర్వాత దానిని శుద్ధి చేస్తారు. ఆపై దాన్నొక విషంగా తయారు చేస్తారు.
ఈ చైనా డాక్టర్ ప్లాన్ ఎంత భయంకరమైందంటే... ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి మహా నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి, ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడాలని భావించాడు. ఒక్కసారి ఈ విషం జనం గొంతులోకి దిగితే..ఇక అంతే సంగతులు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సామూహిక విషప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక, వందలు, వేల మంది ఆస్పత్రుల పాలై, తమ మరణానికి కారణం ఏమిటన్నది తెలియకుండానే చనిపోయి ఉండేవారు. దీంతో దేశ వాసులు ఏ నీరు తాగాలన్నా హడలిపోయి.. దాహం బిగబట్టేవారు. అంతటి భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశాడీ విష ఉగ్రవాది.. మొహియుద్దీన్ సయ్యద్.
డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతడి సహచరులు మొహమ్మద్ సుహేల్, ఆజాద్‌లతో పాటు భారీ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇతడి సొంతం. వీరు నిరంతరం టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ ఉగ్రవాదులతో కోడ్ లాంగ్వేజీలో మాట్లాడేవారని తెలుస్తోంది. వీరికి పాక్ కి చెందిన ఉగ్ర మూకలు కొన్ని డ్రోన్ల సాయంతో ఆయుధాలు చేరవేసినట్టు గుర్తించారు.
ఇది కేవలం విషం కాదు.. ఒక విష ఉగ్ర వ్యూహం. ఈ మొత్తం విష కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బయటపెట్టింది. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న సమాచారంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్. వీరి అనుమానాస్పద సంభాషణలు, టెలిగ్రాం కోడింగ్ మెసేజీలను డీ కోడ్ చేశారు. అలా ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికే పట్టుకున్నారు. వీరి డెన్ లో ఒక రిసిన్ తయారీ సెటప్ ని చూసి షాకై పోయారు ఏటీఎస్ అధికారులు.