క‌రాచీ నీటి సంక్షోభానికి.. సింధూ జ‌లాల ఒప్పందానికీ సంబంధ‌మేంటి?

posted on: Jun 4, 2026 2:31PM

సింధు జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్‌కు వ్యూహాత్మక, ఆర్థిక ఒత్తిడిని పెంచినా,కరాచీ నీటి సంక్షోభానికి మూలకారణం మాత్రం పాకిస్తాన్ అంతర్గత పాలనా వైఫల్యాలు, అవినీతి, మౌలిక సదుపాయాల పతనంగా అంచ‌నా వేస్తున్నారు  అంత‌ర్జాతీయ దౌత్య నిపుణులు. కరాచీకి రోజుకు 1,080 నుంచి 1,200 మిలియన్ గ్యాలన్ల నీటి అవసరం ఉండగా..  వాస్త‌వానికి అందుతున్న నీరు దానికంటే బాగా తక్కువ. రోజుకు 400 మిలియన్ గ్యాలన్లకు పైగా లోటు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 30 నుంచి 40శాతం వరకు లీకేజీలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, అక్రమ మళ్లింపుల వల్ల నీరు బాగా నష్టపోతోంది. పాకిస్తాన్ వ్యవసాయం, జలవిద్యుత్, ఆహార భద్రత, విదేశీ మారక ద్రవ్యంపై.. సింధు నదీ వ్యవస్థ ఆధారపడిన వాస్తవం. ఆ దృష్ట్యా, ఒప్పంద ర‌ద్దు వ్యూహాత్మ‌కం కాగా.. కరాచీ నీటి కష్టాలకు అదే  ప్రధాన కారణం కాదని అంటారు నిపుణులు.

అస‌లు సింధు జలాల ఒప్పందం ఎలా పుట్టింది?  విభజన, నీటి రాజకీయాలు, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం ఎలాంటిద‌ని ప్ర‌శ్నించుకుంటే..  1947 విభజన తర్వాత పంజాబ్ ప్రాంతంలోని కాలువల నియంత్రణ, నీటి ప్రవాహాలపై భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. వ్యవసాయ‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలకు నీటి భద్రత ఒక అస్ధిత్వ ప్రశ్నగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960, సెప్టెంబర్ 19న కరాచీలో సింధు జలాల ఒప్పందం జ‌రిగింది. దీన్నే  ఇండ‌స్ వాట‌ర్ ట్రీటీ  (ఐడబ్ల్యుటి) అంటారు. ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. 

ఈ ఒప్పందం ప్రకారం.. తూర్పు నదులు..  రావి, బియాస్, సట్లెజ్ భారతదేశానికి చెంద‌గా.. పశ్చిమ నదులైన‌.. సింధు, జీలం, చినాబ్..  పాకిస్తాన్‌కు కేటాయించారు. భారతదేశానికి తూర్పు నదులపై పూర్తి నియంత్రణ, పశ్చిమ నదులపై పరిమిత వినియోగ హక్కులైన జలవిద్యుత్,  నీటిపారుదల, న‌ష్టం క‌లిగించ‌ని  వినియోగ హ‌క్కుల‌ను ఇవ్వగా..  పాకిస్తాన్‌కు పశ్చిమ నదుల నీటిపై హక్కులు కల్పించారు. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని, ఏకపక్షంగా రద్దు చేయరాదన్న నిబంధనలున్నాయి. 

1965, 1971 యుద్ధాలు, కార్గిల్ ఘర్షణ, పుల్వామా వంటి అనేక సంక్షోభాల మధ్య కూడా.. ఈ ఒప్పందం నిలకడగా కొనసాగింది. అంతర్జాతీయ వేదికలపై దీన్ని.. ప్రపంచంలో అత్యంత స్థిరంగా నిలిచిన అంతర్జాతీయ జల ఒప్పందాలలో ఒకటిగా వివ‌రించారు.  అయితే, 21వ శతాబ్దంలో వాతావరణ మార్పు, హిమానీనదాల కరుగుదల, జనాభా పెరుగుదల, నీటి అవసరాల విపరీత వృద్ధి, అలాగే పాకిస్తాన్ అంతర్గత నీటి నిర్వహణ వైఫల్యాలు.. ఈ ఒప్పందాన్ని కొత్త ఒత్తిడిగా మారాయి.

పహల్గామ్ దాడి నుంచి ఒప్పంద ప్రతిష్ఠంభన వరకు వ్య‌వ‌హారం ఎలాంటి  మ‌లుపు తీసుకుందో చూస్తే..  2025 ఏప్రిల్ 22న  జ‌రిగిన ప‌హెల్గామ్ దాడి ఈ నీటి ఒప్పందంలో కీల‌క మ‌లుపుగా నిలిచింది. పహెల్గామ్ లో భారత పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్‌కు అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గుంపులు కారణమని భారత ప్రభుత్వం ప్రకటించింది.  2025 ఏప్రిల్ 23–24 మధ్య భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని  స‌స్పెన్ష‌న్లో ఉంచింది. అంటే ఒప్పందంలోని నియ‌మ నిబంధ‌న‌ల పాటింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియా అధికారికంగా ప్రకటించింది.  

ఈ నిర్ణయంతో డేటా పంచుకోవడం, ఇండస్ కమిషనర్ల సమావేశాలు, కొత్త ప్రాజెక్టులపై ముందస్తు సమాచారం, పాకిస్తాన్‌కు ప్రాజెక్టు ఇన్‌స్పెక్షన్ అవకాశాలు.. అన్నీ నిలిచిపోయాయి. ఈ విష‌యంలో భారత వ్యూహం ఎలాంటిదంటే  నీటిని కూడా జియోపాలిటికల్ లీవర్‌గా భావించ‌డం. అంటే కీలెరిగి వాత పెట్ట‌డం లాంటిదని అర్ధం. ఇండియన్  మీడియా, పాలసీ వర్గాల ప్రకారం, ఈ నిర్ణయం మూడు స్థాయిల్లో అమలు చేసే వ్యూహంగా మారింది.  షార్ట్ టర్మ్ లో  డేటా షేరింగ్ నిలిపివేత, ఇన్‌స్పెక్షన్‌ల నిలిపివేత, ఆ తరురవాత మిడ్ టర్మ్ లో పశ్చిమ నదులపై భారత హక్కుల మేరకు నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం.. ఇక లాంగ్ టర్మ్ లో కొత్త డ్యామ్‌లు, డైవర్షన్ ప్రాజెక్టులు, అంతర్గత నీటి వినియోగాన్ని గరిష్ఠం చేసే మౌలిక సదుపాయాల కల్పన. 

ఇది నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపేస్తాం అనే అర్థంలో కాకుండా, భారతదేశం తన హక్కులపై త‌న విచ‌క్ష‌ణాధికారాల‌ను వినియోగించుకుంటూ, పాకిస్తాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచే దిశగా వేస్తోన్న అడుగుగా చూడాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ న్యాయానికి విరుద్ధం, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందానికి విఘాతంగా చెబుతూ, అంతర్జాతీయ న్యాయ వేదికలపై కేసులు వేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఇస్లామాబాద్‌లోని స్ట్రాటజిక్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థల నివేదికలు సూచిస్తున్నాయి. 

అయితే, ఒప్పందంలో స్పష్టమైన ఎగ్జిట్ క్లాజ్ లేకపోవడం, అలాగే.. ఇండియా  సస్పెన్షన్ ను  భద్రతా కారణాలతో న్యాయబద్ధం చేయాలనే ప్రయత్నం,  ఈ వివాదాన్ని క్లిష్టమైన న్యాయ, రాజకీయ మలుపులోకి నెట్టాయి. సింధు జలాల ఒప్పందం. శాశ్వత ఒప్పందం. ఏకపక్షంగా రద్దు చేయరాదని అంటుంది పాకిస్తాన్. వివాద పరిష్కారానికి పర్మనెంట్ ఇండస్ కమిషన్, న్యూట్రల్ ఎక్స్‌పర్ట్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ వంటి బహుస్థాయి వ్యవస్థ ప‌ని చేయాల‌ని  కోరుతుంది. ఇక ప్రపంచ బ్యాంకు పాత్ర, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం గుర్తు చేస్తుంది.

ఇండియా .. ఇండస్ ట్రీటీ  సస్పెన్షన్ ను ప్రకటించడం అంటే..  ఒప్పందాన్ని రద్దు చేయడం కాదని, భద్రతా పరిస్థితుల దృష్ట్యా.. తాత్కాలికంగా బాధ్యతలను నిలిపివేయడమని వాదిస్తోంది . ఇక‌ అంతర్జాతీయ న్యాయ దృష్టి కోణంలోంచి చూస్తే.. అంతర్జాతీయ ఒప్పందాలపై ఉన్న వియన్నా కన్వెన్షన్ ప్రకారం, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, ఊహించ‌ని మార్పుల‌ వంటి కారణాలతో కొన్ని సందర్భాల్లో ఒప్పందాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. అయితే, సింధు ఒప్పందం ప్రత్యేకంగా శాశ్వ‌తంగా పేర్కొనడం వ‌ల్ల‌, సస్పెన్షన్‌కు న్యాయపరమైన స్థిరమైన ఆధారం ఉందా లేదా? అన్నది వివాదాస్పద అంశం.

పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే, భారతదేశం ఉగ్రవాదాన్ని కారణంగా చూపుతూ, నీటిని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందంటోంది. భారత వైపు నుంచి ఎలాంటి వాద‌న  ఉందో గ‌మ‌నిస్తే.. రెండు దేశాల మధ్య శాంతి కోసమో లేదా మరేదైనా అంశం కోసమో ఒక ఒప్పందం కుదిరినప్పుడు, పరస్పర నమ్మకం అనేది చాలా ముఖ్యం. కానీ, ఒక వైపు ఒప్పందం మాట్లాడుతూనే, మరోవైపు సరిహద్దుల గుండా నిరంతరాయంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే... ఆ చర్య ఒప్పందానికి ఉన్న ప్రాథమిక నమ్మకాన్ని, విలువను పూర్తిగా తుడిచిపెట్టేస్తోంద‌ని వాదిస్తోంది ఇండియా. ఇలాంటి పరిస్థితుల్లో భార‌త్  ఆ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలిగే హక్కును పొందుతోంద‌నే వాదన.. ఇవి  రెండూ అంతర్జాతీయ న్యాయ వేదికలపై పరీక్షించబడాల్సిన అంశాలే. 

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ..  సింధు నదీ వ్యవస్థపై ఆధారపడిన నిర్మాణం ఎలాంటిదో ప‌రిశీలిస్తే..  వ్యవసాయం, నీటిపారుదల, ఆహార భద్రత.. పాకిస్తాన్ జీడీపీలో వ్యవసాయ రంగం సుమారు 20 నుంచి  25శాతం వాటా కలిగి.. గ్రామీణ శ్రామిక శక్తికి.. పెద్ద ఎత్తున‌ ఉపాధి కల్పిస్తోంది. సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉన్న నీటిపారుదల వ్యవసాయం మొత్తం నీటిపారుదల వ్యవసాయంలో సుమారు 80 శాతం వరకు ఉంటుంది.  గోధుమ, వరి, పత్తి, చెరకు వంటి కీలక పంటల దిగుబడులు నదీ ప్రవాహాల స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి. నీటి ప్రవాహాల్లో ఏ చిన్న అనిశ్చితి వచ్చినా.. పంట దిగుబడులు తగ్గడం, ఆహార ధరలు పెరగడం, గ్రామీణ అప్పులు, నిరుద్యోగం, సామాజిక అస్థిరత పెరగడం.. వంటి ప్రభావాలు తప్పవు.

సింధు నదీ వ్యవస్థపై ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తిలో గణనీయమైన వాటాను అందిస్తున్నాయి. నీటి లభ్యత తగ్గినా, లేదా ప్రవాహాలపై అనిశ్చితి పెరిగినా.. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. దిగుమతి ఇంధనాలపై ఆధారపడాల్సి వస్తుంది. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి అంతరాయాలు, లోడ్ షెడింగ్, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. 
 
వాతావరణ మార్పు, హిమానీనదాల కరుగుదల,   వర్షపాతం నమూనాల మార్పు, వరదలు, ఎండల తీవ్రత  ఇవన్నీ సింధు నదీ వ్యవస్థను ఇప్పటికే అస్థిరంగా మార్చుతున్నాయి. పాకిస్తాన్‌లో తలసరి నీటి లభ్యత వేగంగా తగ్గుతూ,  నీటి ఒత్తిడి గ‌ల‌ దేశంగా అంతర్జాతీయ నివేదికల్లో ప్రస్తావన పొందుతోంది. ఈ నేపథ్యంలో, సింధు జలాల ఒప్పందంపై అనిశ్చితి .. పాకిస్తాన్‌కు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అదనపు ఒత్తిడిగా మారుతోంది.

ఇక‌ కరాచీ నీటి సంక్షోభం.. ఒప్పందం వల్లా? లేక, అంతర్గత వైఫల్యాల ఫలితమా? అన్న ప‌రిశీలిస్తే..  దాదాపు 20 మిలియన్ల జనాభా ఉన్న కరాచీకి, కొన్ని అంచనాల ప్రకారం రోజుకు 1,080 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు అవసరం. మరికొన్ని అంచనాల ప్రకారం ఈ అవసరం 1,200 మిలియన్ గ్యాలన్లకు పైగా ఉంది. వాస్తవ సరఫరా మాత్రం ఈ గణాంకాల కంటే బాగా తక్కువ అందుబాటులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. రోజుకు 400 మిలియన్ గ్యాలన్లకు పైగా నీటి లోటు ఏర్పడుతోందని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. కీంఝర్ సరస్సు ద్వారా సింధు నదీ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటిపై హబ్ డ్యామ్  సరఫరాలపై ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది క‌రాచీ. ఇక్క‌డ‌ నీటిని పొందడం మాత్రమే సమస్య కాదు,  దానిని వినియోగదారులకు సమర్థవంతంగా స‌ర‌ఫ‌రా చేయ‌డం కూడా అంతే పెద్ద సవాలు.

విప‌రీత‌మైన‌ లీకేజీలు, అవినీతి, ఒక‌ వాటర్ మాఫియాగా ఈ స‌మ‌స్య‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. కొన్ని అంచనాల ప్రకారం, పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 30నుంచి 40శాతం వరకూ.. లీకేజీలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు అక్రమ మళ్లింపులు, ట్యాంకర్ మాఫియా, అనధికార కనెక్షన్లు వల్ల వినియోగదారులకు చేరకముందే నీటి  న‌ష్టం క‌లుగుతోంది. ఇది  సింధు జలాల ఒప్పందం నిలిచిపోయింది కాబట్టి కరాచీకి నీరు రాలేదు అనే నిర్ల‌క్ష్య‌పు వాదనను ఇది పూర్తిగా ఖండిస్తుంది. నీటి మూలాల‌ నుంచి నగరానికి వచ్చే మార్గంలోనే పెద్ద భాగం లీక్ అవుతోంది, దోపిడీకి గురవుతోంది. ఇది పాకిస్తాన్ అంతర్గత పాలన వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.

వేసవి కాలంలో తీవ్ర సంక్షోభం విష‌యానికి వ‌స్తే.. ఇటీవలి సంవత్సరాల్లో వేసవి కాలంలో కరాచీలో.. దాదాపు 70శాతం ప్రాంతాల్లో నీటి సరఫరాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. రోజులు, వారాల తరబడి పైపుల నీరు రాకపోవడం క‌నిపించింది. ట్యాంకర్‌ల కోసం కిలోమీటర్ల క్యూలు, అత్య‌ధిక ధరలు, స్ల‌మ్ ఏరియాల్లో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు గంటల తరబడి తిరగడం, నిల‌బ‌డ్డం వంటి దృశ్యాలు సర్వ‌ సాధారణమైపోయాయి. ఇది ఒక మెట్రోపాలిటన్ నగరానికి తగిన నీటి పాలన కాదు. వ్య‌వ‌స్థ‌ పూర్తిగా కుప్ప‌ కూలిపోయిన దృశ్యం. ఇందుకు సింధు ఒప్పంద ప్ర‌తిష్టంభ‌న‌ అదనపు ఒత్తిడి మాత్రమే. అదే ముఖ్య కార‌ణం కాదు.

ఇక రాజకీయ, సామాజిక, మీడియా కోణాల ప‌రంగా  చూస్తే..  నీటి జాతీయత వ‌ర్సెస్ పాలనా వైఫల్యం అంశానికొస్తే..  పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, బాధ్యతను త‌ప్పించుకునేందుకు ఇత‌రుల‌పైకి నెట్టేందుకే ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పాకిస్తాన్‌లో రాజకీయ వర్గాలు, కొన్ని మీడియా సంస్థ‌లు సింధు జలాల ఒప్పంద ప్రతిష్ఠంభనను భారతదేశం నీటిని ఆయుధంగా ఉపయోగిస్తోందనీ, పాకిస్తాన్‌ను ఎండబెట్టే కుట్ర చేస్తోంద‌నీ.. వంటి నినాదాలతో ప్రజా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.

స‌రిగ్గా అదే సమయంలో.. ద‌శాబ్దాల‌ పాటు నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల లోపం, అవినీతి, అక్రమ కనెక్షన్లు, ట్యాంకర్ మాఫియా, నగర ప్రణాళికలో నీటి భద్రతకు ప్రాధాన్యం లేకపోవడం వంటి అంతర్గత వైఫల్యాలపై సీరియస్ రాజకీయ విచారణ, బాధ్యత నిర్ధారణ లేకుండా పోయింది. పాకిస్థాన్ లో ఇలాంటి పార‌ద‌ర్శ‌క‌త మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. 

ఇక భారత మీడియా, పాలసీ వర్గాల్లో ఎలాంటి వాద‌న వినిపిస్తోందంటే, సింధు ఒప్పందం సస్పెన్షన్‌ను టెర్రరిజానికి స్ట్రాటజిక్ రెస్పాన్స్ గా చూస్తోంది. పాకిస్తాన్‌పై హైడ్రోలాజికల్ లీవరేజ్ గా అంతర్జాతీయంగా  ఇండియా తన హక్కులను వాడుకుంటోంది  అనే కోణంలో చర్చిస్తోంది. ఇది నీటిని పూర్తిగా డిప్లొమాటిక్ టూల్ గా ఉపయోగించే దిశగా ఒక స్పష్టమైన మార్పు. అయితే, ప్రస్తుత మౌలిక సదుపాయాల దృష్ట్యా, భారతదేశం వెంటనే నీటి ప్రవాహాలను భారీగా తగ్గించగల స్థితిలో లేదు   ఇది కూడా ఒక క‌ఠిక‌ వాస్తవం. 

అంతర్జాతీయ వేదికల‌పై  కోఆపరేషన్ అవసరం, కానీ ఒత్తిడి కూడా అంతే వాస్తవం. అంతర్జాతీయ థింక్‌ ట్యాంకులు, జలవనరుల నిపుణులు, సింధు ఒప్పందం సస్పెన్షన్‌ను ఒక  హైడ్రో పాలిటికల్ షాక్ గా అభివ‌ర్ణిస్తున్నారు. కానీ దీర్ఘకాలంలో కొత్త వాట‌ర్ కోప‌రేటివ్ స‌ర్కిల్ కి దారితీసే అవకాశంగానూ దీన్ని చూస్తున్నారు.  వాతావరణ మార్పు, జనాభా ఒత్తిడి, నీటి అవసరాల పెరుగుదల దృష్ట్యా.. ఇండస్ బేసిన్‌లో సహకారం తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ, ఆ సహకారం ఎలా, ఏ నిబంధనలతో, ఏ రాజకీయ వాస్తవాల మధ్య కొనసాగాలి అన్నది కొత్త ప్రశ్న.

సింధు జలాల ఒప్పందం.. సస్పెన్షన్ వల్ల పాకిస్తాన్‌కు.. నీటి ప్రవాహాలపై అనిశ్చితి, వ్యవసాయం, జలవిద్యుత్, ఆహార భద్రతపై మానసిక, ఆర్థిక ఒత్తిడి.. పెట్టుబడిదారుల దృష్టిలో రిస్క్ పెరుగుదల – నీటి భద్రత లేని దేశంగా ఇమేజ్, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి, దిగుమతి ఇంధనాలపై ఆధారపడే అవకాశం.  రాజకీయంగా వాటర్ నేషనలిజం పెరుగుదల, అంతర్గత సమస్యలను కూడా బ‌య‌ట  శ‌క్తుల వ‌ల్లే అనేలాంటి చాక‌చ‌క్యం  ఇవన్నీ ప్ర‌స్తుతం పాక్ చేస్తున్న ప్ర‌యోగాలే. 

కానీ కరాచీ సంక్షోభం సింధు ఒప్పందం కంటే ముందే ఉన్న దీర్ఘకాలిక వైఫల్యం..  ఒప్పంద సస్పెన్షన్‌కు ముందే సంవత్సరాలుగా ఇది తీవ్రంగా ఉంది. నగర జనాభా పెరుగుదల, అనియంత్రిత అర్బన్ స్ప్రాల్,  నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల లోపం, లీకేజీలు, అవినీతి, ట్యాంకర్ మాఫియా, అక్రమ కనెక్షన్లు.. వంటి కారణాల వల్ల సిస్టమిక్ ఫెయిల్యూర్ గా మారిందిది.

అందువల్ల,  సింధు జలాల ఒప్పంద ప్రతిష్ఠంభన కరాచీని ఎండబెడుతోంది అనే వాదన రాజకీయంగా ఆకర్షణీయమైనా, వాస్తవానికి అది సగం నిజం, సగం మాయ. అవును..  ఒప్పందంపై అనిశ్చితి పాకిస్తాన్ మొత్తం నీటి భద్రతపై ఒత్తిడి పెంచుతోంది. కానీ, కరాచీ నీటి సంక్షోభానికి ప్రధాన కారణం పాకిస్తాన్ అంతర్గత పాలన వైఫల్యం, నగర ప్రణాళికలో నీటి భద్రతను నిర్లక్ష్యం చేయడం మాత్రమే. 

క‌రాచీకి నిజమైన ఎదురు దెబ్బ ఎక్కడ? అని  చూస్తే.. భారతదేశం.. సింధు ఒప్పందాన్ని వ్యూహాత్మక అవ‌కాశంగా ఉపయోగిస్తూ, పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతోంది.  ఇది స్పష్టమైన జియోపాలిటికల్ గేమ్. పాకిస్తాన్ ద‌శాబ్దాల‌ పాటు నీటి మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసి, అవినీతి, మాఫియా, రాజకీయ లాభాల కోసం నీటి వ్యవస్థను పాడుచేసింది. ఇది పూర్తి అంతర్గత వైఫల్యం.

కరాచీ ప్రజలు.. ఈ రెండు స్థాయిల్లోనూ.. అంతర్జాతీయ జలరాజకీయాలు, దేశీయ పాలన వైఫల్యాలు  రెండింటికీ బలి ప‌శువుగా మారుతున్నారు. సింధు జలాల ఒప్పంద ప్రతిష్ఠంభన పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా, ఆర్థికంగా దెబ్బతీస్తోంది.  కానీ కరాచీ నీటి సంక్షోభం ప్రధానంగా పాకిస్తాన్ స్వయంగా కొని తెచ్చుకున్న సంక్షోభం. 
ముందున్న మార్గం ఎలాంటిది?..  జలరాజకీయాల మధ్య ప్రజల నీటి హక్కుల ప‌రిస్ధితి ఏంట‌ని  ప్ర‌శ్నించుకుంటే..  ఇండస్ బేసిన్‌కు కొత్త సిస్ట‌మ్ అవసరమ‌ని అంటారు నిపుణులు. వాతావరణ మార్పు, జనాభా ఒత్తిడి, నీటి అవసరాల పెరుగుదల దృష్ట్యా.. సింధు జలాల ఒప్పందాన్ని నవీకరించడం
డేటా షేరింగ్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, డ్రౌట్ మేనేజ్‌మెంట్, గ్లేసియర్ మానిటరింగ్ వంటి అంశాలను చేర్చడం.. జలవనరులపై సైన్స్ బేస్డ్, ట్రాన్స్‌పరెంట్, కోఆపరేటివ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించడం అత్యవసరంగా తెలుస్తోంది.

పాకిస్తాన్ అంతర్గత సంస్కరణలు..  కరాచీకి నిజమైన పరిష్కారం. బేసిగ్గా కరాచీ వంటి నగరాలకు.. నీటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం ముఖ్యం. లీకేజీల నియంత్రణ, అక్రమ కనెక్షన్లపై కఠిన చర్య,  ట్యాంకర్ మాఫియా, వాటర్ కార్టెల్‌లను అణచివేయడం వంటివి చేయాలి. నగర ప్రణాళికలో నీటి భద్రతను కేంద్రంగా ఉంచడమూ అవ‌స‌ర‌మే. ఇలాంటివి లేకుండా, ఎన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నా, లేకున్నా..  ప్రజలకు మాత్రం నీరు చేరను గాక చేర‌దు.

నీరు కేవలం జాతీయ గౌరవం, జియోపాలిటికల్ ఆయుధంగా మాత్రమే కాకుండా.. ప్రజల జీవన హక్కు, ఆరోగ్యం, ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న ప్ర‌ధాన‌ హక్కుగా చూడాలి. ఇందులో భారత్, పాకిస్తాన్ రెండూ తమ తమ ప్రజల ముందు పాలన బాధ్యతను గుర్తించాల‌ని అంటారు దౌత్య నిపుణులు. అంతర్జాతీయ వేదికల ముందు సహకార బాధ్యతను నిజాయితీగా స్వీకరించాల్సిన అవసరం కూడా ఉందంటారు వీరు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...