జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికలు.. కాంగ్రెస్ వ్యూహం?

posted on: Jul 9, 2026 11:14AM

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా..  ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఒకవేళ ఇదే జరిగితే..  సైబరాబాద్,  మల్కాజ్‌గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్,  తుది తేదీలపై  స్పష్టత రావాల్సి ఉంది.

2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ   బీఆర్ఎస్   ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ   48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం  44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.  

ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.  ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ..  గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం..  శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం  జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్‌గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక  పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  

Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections

google-ad-img
    Related Sigment News
    • Loading...