సిగ్గొదిలేసిన సీమాంధ్ర కాంగ్రెస్
posted on: May 8, 2014 2:25PM
.jpg)
సీమాంధ్ర కాంగ్రెస్ సిగ్గూ, ఎగ్గూ వదిలేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు చంపేశారు. అయినప్పటికీ ఆశ చావని కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ముందుకు తోసి సీమాంధ్రలో ఎంతోకొంత లాభం పొందాలని ప్రయత్నించింది. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసే సీమాంధ్రని అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పింది.
అయితే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యంగా చూడటం మానలేదు. ఆ విషయం బుధవారం జరిగిన సీమాంధ్ర పోలింగ్‌లో కూడా స్పష్టమైంది. ఓటింగ్ జరిగిన పరిస్థితిని చూస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపం వైకాపా తాను అధికారంలోకి వస్తానని బిల్డప్పులు ఇచ్చుకుంటోంది. జై సమైక్యాంధ్ర పార్టీ కిక్కురుమనడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను సీమాంధ్రలో అధికారంలోకి వస్తానని చెప్పేంత సాహసమైతే చేయలేదుగానీ, సీమాంధ్రలో తాము చాలా సీట్లు గెలుచుకుంటామని, సీమాంధ్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ పార్టీ మద్దతు తీసుకోవలసి వస్తుందని చెబుతోంది.
గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మాటలే చెప్పారు. ఆ మాటలు చెబుతున్నప్పులు సదరు నాయకుల ముఖంలో ఎంతమాత్రం సిగ్గు కనిపించకపోవడం విశేషం. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్ సీట్ అయినా దక్కే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే, సదరు పార్టీలో సిగ్గు అనే మెటీరియల్ మాయమైపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు.




.jpg)
.webp)

.webp)


