నెత్తీనోరూ బాదుకున్నా ప్రతిపక్ష హోదా దక్కదు!
posted on: Jul 8, 2014 10:30AM
.jpg)
దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టినంత దరిద్రపు దుస్థితి భవిష్యత్తులో మరేపార్టీకీ పట్టదేమో! ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఒక వెలుగు వెలిగి, ఆడింది ఆటగా పాడింది పాటగా హవా నడిపించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంకఛండాలంగా తయారైంది. కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో పవర్ పోయింది. అయిదేళ్ళపాటు పనికిమాలిన రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే, లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రావడం దేశ ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించే విషయమే. సాధారణంగా లోక్‌సభలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 52 లోక్‌సభ స్థానాలు సాధించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలతో సరిపెట్టుకోవడంతో 16వ లోక్‌సభలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయింది. అయితే తాము చేసిన ఘోర తప్పిదాల ఫలితమే ఈ పరిణామమని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ సరిపెట్టుకోకుండా ఈ అంశం విషయంలో నానా రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వరూ అంటూ బీజేపీని బతిమాలే ధోరణిలో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ అతి వినయాలకు లొంగకపోవడంతో స్వరం పెంచింది. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా బీజేపీ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అహం దెబ్బతింది. దాంతో ఆమే స్వయంగా రంగంలోకి దిగి తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని మొత్తుకున్నారు. సీట్ల బలాబలాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎంతమాత్రం సిగ్గుపడకుండా అడిగేశారు. అలా ఇవ్వకపోతే మర్యాదగా వుండదని కూడా బీజేపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల ముందే తమ పార్టీ తమలాంటి దరిద్రపు భావాలున్న పార్టీలతో జతకట్టాం కాబట్టి, అన్ని పార్టీలకూ వచ్చిన సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆమె కాకమ్మ లెక్కలు చెప్పారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పార్లమెంటుని సాగనివ్వమని కూడా బెదిరింపు సెక్షన్‌లోకి ఆమె దిగారు. ఈ బెదిరింపులను చూస్తుంటే అధికారం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఎంతమాత్రం బుద్ధిరాలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చూడమ్మా సోనియమ్మా.. మీరెంత అరిచి గీపెట్టినా, నెత్తీనోరూ బాదుకున్నా మీకు ప్రతిపక్ష హోదా దక్కదు.



.jpg)


.webp)



