Latest News
పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఒక్కటవుతాయా?
posted on: Mar 17, 2017 6:02PM

రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం... అప్పటివరకూ ఎవరూ ఊహించని పరిణామాలు ఈజీగా జరిగిపోతుంటాయి. అప్పటికప్పుడే శత్రువులు మిత్రులుగా.... మిత్రులు శత్రువులుగా మారిపోతారు. అధికారమే లక్ష్యంగా సాగే ఈ ఆటలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగబోతోంది.
పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఒక్కటవుతాయన్న టీడీపీ ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి పూర్వవైభవం తేలేకపోయినా, కనీసం తామున్నామని అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ నేతలు... జగన్‌తో కలిసి నడిచేందుకు అడుగులేస్తున్నారు.
కారణాలేవైనా జగన్ విషయంలో అనుసరించిన విధానం, తీసుకున్న నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. రాష్ట్ర విభజనతో ఏపీలో నష్టపోయినా... కనీసం తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తామన్న అంచనాలు తల్లకిందులవడంతో ఢిల్లీ పెద్దలు కంగుతిన్నారు. మరోవైపు ఏపీలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో అధిష్టానం నివ్వెరపోయింది. ఇటు తెలంగాణలో కేసీఆర్ దెబ్బకు పార్టీ విలవిల్లాడుతుంటే.... ఇక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని తిరిగి నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ జగన్ వైపు చూస్తోంది. ఆ మేరకు మూడ్నెళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఏఐసీసీ.... ముందుగా కేవీపీ ద్వారా ప్రాథమిక చర్చలు పూర్తిచేసి...ఆ తర్వాత దిగ్విజయ్‌ను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.
ఆ మధ్య జగన్మోహన్‌రెడ్డితో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపిన దిగ్విజయ్... తనకున్న చనువుతో మరోసారి జగన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ, కాంగ్రెస్‌ను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఏఐసీసీ ప్రయత్నిస్తున్నా.... జగన్ మాత్రం వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తే.... ఆస్తుల కేసుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చిక్కులు తప్పవని భయపడుతున్నట్లు చెబుతున్నారు.






