కాంగ్రెస్ మంకు పట్టుకి పార్లమెంటు సమావేశాలు బలి
posted on Aug 3, 2015 3:35PM
.jpg)
పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడమే తమ పార్టీ ఈసారి అనుసరించబోయే వ్యూహమని ఆ పార్టీ ఎంపీ శశీ ధరూర్ సమావేశాలు మొదలయిన రోజే మీడియాకి లీక్ చేసి సోనియాగాంధీ చేత చివాట్లు తిన్నారు. ఆ రహస్యం బయటపడిన తరువాతయినా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చుకొనే ప్రయత్నం చేయకుండా వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు రాజీనామా చేసే వరకు ఉభయ సభలను జరగనీయకుండా అడ్డుపడుతోంది. ఈనెల 13తో ఈ పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. గత రెండు వారాలుగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతుండటంతో ఈసారి పార్లమెంటులో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదు. ఆమోదం పొందలేదు. వారు ముగ్గురు రాజీనామా చేస్తేనే సభను సజావుగా నడవనిస్తామని కాంగ్రెస్ వాదిస్తుంటే, సభను నడవనిస్తే వారి ముగ్గురిపై లేవనేతిన అభియోగాలపై చర్చిద్దామని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి యం. వెంకయ్య నాయుడు ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మంకుపట్టు పట్టడంతో ఈ సమావేశంలో ఎటువంటి పరిష్కారం లభించలేదు. కనుక మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి మొదలయిన పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు మళ్ళీ ఆందోళనకి ఉపక్రమించాయి. భూసేకరణ బిల్లుకి సవరణలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇదివరకు దానిపై పార్లమెంటులో లోతుగా చర్చించాలని వాదించాయి. కానీ ఇప్పుడు ఏ ఒక్క బిల్లు కూడా ఎటువంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదింపబడే పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ సుష్మ స్వరాజ్, వసుందర రాజే ఇరువురూ కూడా లలిత్ మోడీకి వీసా వచ్చేందుకు సహకరించి ఉండి ఉంటే, అది తప్పే. అదే విధంగా అనేకమంది మృతికి కారణమయిన వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత్ర ఉంటే ఆయన శిక్షార్హుడే. కానీ వారు రాజినామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిప జేయడం ఇంకా పెద్దతప్పు. బాధ్యతారాహిత్యమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన రాజకీయ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంది తప్ప ప్రజల గురించి, పార్లమెంటులో తన బాధ్యతల గురించి ఆలోచించకపోవడం చాలా శోచనీయం. పైగా తమ డిమాండ్లు నేరవేరుస్తే తప్ప పార్లమెంటుని సజావుగా సాగానీయమని కేంద్రప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మరో తప్పు. ప్రజా సమస్యల గురించి చర్చించవలసిన పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా రాజకీయాలు చేయడాన్ని యావత్ దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తమని ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకొని తమ తప్పులను సరిదిద్దుకొంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు అటువంటి ప్రయత్నమేదీ చేయనే లేదని నిరూపిస్తోంది.